Uttar Pradesh election 2022: సాధారణంగా కొంతమంది టికెట్లు ఆశించో, గెలుపు కోసమో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు మారుతుంటారు. కానీ ఈయన ఏ పార్టీకి వెళ్లినా.. చివరకు స్వతంత్రుడిగా పోటీ చేసినా.. ఓటర్లు మాత్రం ఆయన్నే గెలిపిస్తున్నారు. ఈ అరుదైన ప్రత్యేకతను దక్కించుకుంది.. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా మాంట్ నియోజకవర్గం. ప్రజల హృదయాలను గెలిచిన ఆ జన నేత పేరు శ్యామ్ సుందర్ శర్మ. 1989 నుంచి ఒకే స్థానం నుంచి గెలుస్తూ వస్తోన్న శర్మ.. తొమ్మిదో విజయం కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
1989లో తొలిసారి..
72 ఏళ్ల శ్యామ్ సుందర్ శర్మ 1989లో తొలిసారిగా మాంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ టికెట్‌పైనే 1991, 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత 2002, 2007లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినా.. ప్రజలు ఆయనకే ఓటేశారు.
అయితే 2012లో మాత్రం ఆర్ఎల్‌డీ యువ నేత జయంత్ చౌధరీపై పోటీ చేయగా.. శ్యామ్ సుందర్ శర్మకు తొలిసారి ఓటమి ఎదురైంది. ఆ ఎన్నికల్లో శర్మ స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. అయితే అప్పటికే జయంత్ చౌధరీ మథుర లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఫలితాల తర్వాత జయంత్ ఎంపీ స్థానంలో కొనసాగేందుకే మొగ్గుచూపగా.. మాంట్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో రెండు నెలలకే ఉప ఎన్నిక నిర్వహించారు. అప్పుడు కూడా శర్మ ప్రభంజనం కొనసాగింది.
మరోమారు గెలుపుపై ధీమా..
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శర్మ.. విజయం సాధించారు. 2016లో శర్మ బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున మరోసారి మాంట్ నుంచే పోటీ చేయగా.. 432 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2017 ఎన్నికల్లో మథుర జిల్లాలోని మిగతా అన్ని నియోజకవర్గాల్లో భాజపా జెండా ఎగిరినప్పటికీ.. మాంట్ స్థానంలో మాత్రం శర్మ దూకుడును కాషాయ పార్టీ నిలువరించలేకపోయింది. ఇప్పటివరకు మొత్తం 8 సార్లు శర్మ మాంట్ నుంచి అసెంబ్లీకి వెళ్లగా.. వచ్చే ఎన్నికల్లోనూ తొమ్మిదోసారి గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
" ప్రజలే నాకు అండాదండా. ఆ దేవుడి కంటే ఎక్కువగా ప్రజలనే నేను గౌరవిస్తాను. వారి కోసమే పని చేస్తున్నా. అందువల్లే ఓటర్లు కూడా నామీద ప్రేమ కురిపిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు 8 సార్లు గెలిచాను. స్వతంత్ర అభ్యర్థిగానూ విజయం సాధించా. ప్రజలే నా పార్టీ.. వారే నా బలం"
- శ్యామ్ సుందర్ శర్మ
ఈసారి కూడా ఆయన బీఎస్పీ టికెట్‌పైనే పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో బీఎస్పీ పార్టీకి అంతగా ప్రాబల్యం లేకపోవడంతో మాంట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శర్మకు పోటీగా అఖిలేశ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు సంజయ్ లాథర్‌ను సమాజ్‌వాదీ పార్టీ బరిలోకి దించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: ఉత్తరాఖండ్లో మోదీ ఇమేజ్ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేనా?