Utpal Parrikar quits BJP: గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్.. భారతీయ జనతా పార్టీని వీడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు. భాజపా గురువారం విడుదల చేసిన తొలి జాబితాలో ఉత్పల్ పారికర్‌కు చోటు కల్పించలేదు. ఈ క్రమంలోనే పార్టీ మారతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ.. తాజాగా ప్రకటన చేశారు ఉత్పల్. మనోహర్ పారికర్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన పనాజీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అటనాసియో మొన్సెరేట్కే మళ్లీ అవకాశం ఇచ్చింది భాజపా.
" మరో అవకాశం లేకపోవటం వల్ల భాజపాను వీడుతున్నా. పార్టీకి రాజీనామా చేశాను. పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. రాజీనామా అనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. భాజపా ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకోవటం చాలా క్లిష్టమైనదే అయినా.. గోవా ప్రజల కోసం చేయాల్సి వచ్చింది. నా రాజకీయ భవిష్యత్తుపై ఎవరూ బెంగపడొద్దు. గోవా ప్రజలు చూసుకుంటారు. "
- ఉత్పల్ పారికర్
తాను నమ్మే విలువల కోసం పోరాడుతున్నానని, పనాజీ ప్రజలకే నిర్ణయాధికారాన్ని వదిలేస్తున్నట్లు తెలిపారు ఉత్పల్. పార్టీతో చర్చలు చేపట్టలేనన్నారు. ఇతర పార్టీల మద్దతు తీసుకుంటారా? అని విలేకరులు అడగగా.. తనకు భాజపా ఒక్కటే వేదిక అని సమాధానమిచ్చారు. ' భాజపాను కాదనుకుంటే.. ఎన్నికలకు స్వతంత్రంగానే వెళతాను. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లను. ' అని స్పష్టం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: పారికర్ కుమారుడికి భాజపా షాక్.. పార్టీ మారతారా?