అటవీ ఏనుగుల దాడి నుంచి జనావాసాలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అయినా ఫలితం లేకపోయింది. గజరాజుల దాడికి గురైన బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. పంటపొలాల్లో ఏనుగులు బీభత్సం కారణంగా ఎంతో మంది రైతులు నష్టాలపాలవుతున్నారు. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ కొత్త వ్యూహాన్ని ప్రారంభించింది. దీన్ని తొలిసారిగా కర్ణాటకలో అమలు చేస్తున్నారు. కొడగు జిల్లాలోని కేదముళ్లూర్, నానాచీ గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్ను ప్రయోగాత్మకంగా చేపట్టారు.
ఏనుగులు జనావాసాలు, పంటపొలాల్లోకి ప్రవేశించికుండా.. తేనెటీగల పెట్టెలు అడ్డుకోనున్నాయి. ఇందుకోసం ఒక్కో పెట్టెను 3-4 అడుగుల దూరంలో ఏర్పాటుచేసి.. తీగల సాయంతో వాటిని అనుసంధానించారు. ఏనుగు రాగానే ఆ తీగ ఊగడం వల్ల.. తేనెటీగలు దాడి చేస్తాయి. దీంతో గజరాజులు వెనక్కి వెళ్లిపోతాయి. దీనివల్ల మానవులకు రక్షణ కలగడం సహా.. రైతుల ఆదాయంపై ప్రభావం పడకుండా ఉంటుందని అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల్లో 'ఖాదీ అండ్ విలేజ్ ఎంప్లాయ్మెంట్ రీ-హబ్ పైలట్ ప్రాజెక్ట్' కింద రూ.15 లక్షల వ్యయంతో తేనెటీగల వ్యూహం అమలవుతోంది.
ఇదీ చదవండి: 'పబ్జీ' గొడవలో 13 ఏళ్ల బాలుడి హత్య!