అక్రమార్కుల ధాటికి నగరాల్లో మురుగు, వరద నీటిపారుదల వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. చెరువులు, నాలాల ఆక్రమణలతో నీళ్ల రాకపోకలకు దారులు మూసుకుపోయి పట్టణ ప్రాంతాలు తీవ్రంగా ముంపునకు గురవుతున్నాయి. నిరుడు అక్టోబరులో భాగ్యనగరంలో ఒకరోజులో కురిసిన కుండపోత వర్షానికి వందల కాలనీలు నీట మునగడంతో వేల కుటుంబాలు విలవిల్లాడాయి. 33 మంది దుర్మరణం పాలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 అడుగుల మేరకు కొన్ని రోజుల పాటు నీరు నిలిచిపోయి అపార నష్టం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వరదలకు ఆక్రమణలే ముఖ్య కారణమని నీతి ఆయోగ్ విస్పష్టంగా పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ప్రత్యేక ప్రణాళిక ఏదీ లేదని, వాతావరణ హెచ్చరికలను సైతం సరిగ్గా వినియోగించుకోలేక పోవడంతో భారీ నష్టం చోటుచేసుకుందని చెప్పింది. హుస్సేన్ సాగర్, మూసీకి నీళ్లను తీసుకెళ్లే మురుగు నాలాలన్నీ ఆక్రమణలకు గురవడంతోనే తీవ్రస్థాయి వరద ముంచెత్తిందని వెల్లడించింది.
నగరీకరణ వేగంతో...
ఉపాధి అవకాశాల కోసం పల్లెల నుంచి వలసలు భారీగా పెరుగుతుండటంతో పట్టణాలు, నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో వాటి చుట్టుపక్కల ఉండే చిత్తడి నేలలు క్రమేణా కనుమరుగవుతున్నాయి. వేల సంఖ్యలో ఉండే చెరువులు ఆక్రమణలకు గురవుతూ వందల్లోకి చేరుకుంటున్నాయి. విస్తరిస్తున్న జనాభాతో భూ వినియోగం పెరిగిపోతోంది. ఎకరా వ్యవసాయ భూమి విలువ కోట్ల రూపాయలకు చేరడంతో కొందరు భూబకాసురులు కుంటలు, చెరువులు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ ఆక్రమణల పర్వం కొందరు రాజకీయ నేతల అండదండలతో యథేచ్ఛగా సాగిపోతోంది. నాలాల ఆక్రమణతో మురుగు నీరు పోయే మార్గాలు తగ్గిపోతున్నాయి. దీంతో వర్షాకాలంలో ముంపు సమస్య తీవ్రమవుతోంది. పట్టణాల్లో పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మురుగు నీటిపారుదల వ్యవస్థ విస్తరించట్లేదు సరికదా, దశాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న నాలాలు సైతం ఆక్రమణలతో చిక్కిపోతున్నాయి.
హైదరాబాద్‌లో నిజాం కాలంలో నిర్మించిన నాలాలు చాలా ప్రాంతాల్లో కనుమరుగయ్యాయి. 1221 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నాలాల్లో 390 కిలోమీటర్ల మేరకు మేజర్ డ్రెయిన్లు ఉండగా 28 వేల వరకు ఆక్రమణలు ఉన్నాయని 2003లో కిర్లోస్కర్ కమిటీ వెల్లడించింది. ఆక్రమణల తొలగింపు, నాలాల విస్తరణకు అయిదు వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసింది. వర్షపు నీటిని తరలించే నీటి వనరుల విస్తీర్ణం వేగంగా పడిపోవడంతో భారీ వర్షాల సమయంలో వందలాది కాలనీలు నీట మునుగుతున్నాయని, వెంటనే నీరు సాఫీగా సాగేలా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళించాలని హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ పర్యావరణ కేంద్రం గతంలోనే సూచించింది. ప్రభుత్వాలు కమిటీలు వేయడం, వాటి నివేదికలను బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారుతోంది. అరకొర నిధులతో పనులు ప్రారంభించి అనంతరం పట్టించుకోకపోవడంతో గత సంవత్సరం మహానగరం వరదలతో అల్లకల్లోలమైంది. వీటి ధాటికి 37,409 కుటుంబాలు ప్రభావితమైనట్లు జీహెచ్‌ఎంసీ అంచనా వేసింది. నగరానికి రూ.670 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని పురపాలక మంత్రి స్పష్టం చేశారు. భారీ వర్షాలు వచ్చినా ముంపు సమస్యను తట్టుకునేలా నగరం నుంచి బాహ్యవలయరహదారి వరకు నాలాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.858 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ) చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది జరిగి నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలాలపై ఉన్న 10 వేల ఆక్రమణలను కూల్చాలనుకున్నా వెయ్యింటిని కూడా కూల్చలేకపోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతతో వ్యవహరించడంతో పాటు శాసనసభ్యులు, స్థానిక నేతలు సహకరిస్తేనే చెరువుల ఆక్రమణల తొలగింపు, నాలాల ప్రక్షాళన సాధ్యం అవుతుంది.
పకడ్బందీ కార్యాచరణ అవసరం..
పట్టణాలు, ప్రధాన నగరాల్లోని చెరువుల నిర్వహణ, నాలాల అభివృద్ధిపై పర్యవేక్షణతో పాటు ఆక్రమణలను నిరోధించడానికి ఒక ప్రత్యేక ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నగర ప్రణాళికలకు అనుగుణంగా తక్షణం డ్రైనేజీ వ్యవస్థలనూ విస్తరించాలి. చెరువుల పూర్తి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిలోని ఆక్రమణలను వెంటనే తొలగించడంతో పాటు, నీరు వచ్చే మార్గాలు, అధికంగా ఉన్న నీరు బయటకు పోయే మార్గాల్లో అడ్డంకులను తొలగించాలి. నగర పాలక, పురపాలక సంస్థల ఆదాయాలతోనే ఈ పనులు చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వాలు భారీగా నిధులు సమకూర్చితేనే అలాంటి ప్రణాళికలు త్వరగా పట్టాలకెక్కుతాయి. వరద నీటి ప్రవాహాన్ని నియంత్రించేలా నాలాలను పునరుద్ధరించి ఆక్రమణలను తొలగించాలి. నాలాలు, డ్రైయిన్లు, నీటి ప్రవాహ మార్గాలు, వరద మైదానాల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి... కొత్తగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు వాటికి దూరంగా ఉండేలా చూడటం ఎంతో ముఖ్యం. కొత్త లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే సమయంలో ఇందుకు సంబంధించిన నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలి. మురుగు, వరద నీటికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలి. నిర్ణీత కాలవ్యవధిని రూపొందించుకుని నాలాలు, చెరువుల్లో పూడికతీత చేపట్టాలి. స్థానిక సంస్థలు, నీటిపారుదల, రెవిన్యూ శాఖల మధ్య సమన్వయంతో పాటు రాజకీయ చిత్తశుద్ధి ఉంటేనే ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుంది. తాత్కాలిక సర్దుబాట్లతో, అరకొర నిధులతో నామమాత్రంగా చేస్తే, భవిష్యత్తులో మరిన్ని విపత్తులను ఎదుర్కొనక తప్పదు!
చెరువులు కనుమరుగు..
హైదరాబాద్‌లో 2010 నాటికి 350 చెరువులు ఉండగా, 2021 నాటికి 185 మిగిలాయి. వీటిలోనూ ఇప్పుడు 75 చెరువుల ప్రవాహ మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. దశాబ్ద కాలంలో దాదాపు మూడు వేల హెక్టార్ల విస్తీర్ణం మేరకు చెరువులు, కుంటల భూమి దురాక్రమణ పాలయింది. భాగ్యనగరంలో ప్రతినిత్యం ఏదో ఒక చెరువు ఆక్రమణదారుల చేతుల్లో చిక్కి శల్యమవుతూనే ఉంది. విశాఖలో గత నలభై ఏళ్లలో సుమారు 1800 హెక్టార్ల విస్తీర్ణంలో చెరువులు, కుంటల భూమి అక్రమార్కుల పరమైంది. 2015, 2017 సంవత్సరాలలో చెన్నై నగరం అతలాకుతలం అవడానికి ప్రధాన కారణం పలు చెరువులు పూర్తిగా కనుమరుగు కావడం, కొన్ని పూర్తిగా ఆక్రమణల పాలవ్వడమేనని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, విజయనగరం, రాయలసీమ జిల్లాల్లోని అనేక చెరువులు సైతం దురాక్రమణకు గురయ్యాయని 2020లో కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది.
- ఎం.ఎస్.వి.త్రిమూర్తులు
ఇవీ చదవండి: ముంబయిలో ఇల్లు కూలి 11మంది మృతి