లఖింపుర్ హింసాత్మక ఘటనపై రాజకీయ ప్రకంపనలు ఉత్తర్‌ప్రదేశ్‌ను కుదిపేశాయి. ఘటనపై విచారణ చేపడతామని ప్రభుత్వం హామీనిచ్చినా.. విపక్షాలు వెనకడుగు వేయలేదు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన విపక్ష నేతలను అధికారులు అడ్డుకున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్ ఖేరీలో(Lakhimpur Kheri violence) హింస చెలరేగింది. టికునియా-బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది(lakhimpur kheri news today).
ప్రభుత్వం ఇలా..
రైతులతో చర్చలు జరిపిన ఉత్తర్‌ప్రదేశ్ అధికారులు.. వారితో ఒక ఒప్పందానికి వచ్చినట్లు చెప్పారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, యూపీ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవనీశ్ అవస్థి వెల్లడించారు. క్షతగాత్రలకు పది లక్షల పరిహారం అందిస్తామని వివరించారు. కేంద్ర మంత్రి కుమారుడు సహా పలువురిపై.. రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అవనీశ్ వివరించారు. రైతులను కారుతో ఢీ కొట్టిన ఘటనపై.. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
ఘటనపై ఓవైపు దర్యాప్తును వేగవంతం చేస్తూనే మరోవైపు విపక్షాలను ఎక్కడికక్కడ కట్టడి చేసింది యూపీ ప్రభుత్వం. కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను నిర్బంధించింది.
వెనకడుగు వేయని విపక్షాలు..
హింసాత్మక ఘటనలపై విపక్షాలు గళమెత్తాయి. బాధితులకు అండగా ఆందోళనకు దిగాయి. వారిని కలిసేందుకు ప్రియాంక గాంధీ(priyanka gandhi news) బయలుదేరగా.. ఆమెను సితాపుర్ ప్రాంతంలో అడ్డుకున్న పోలీసులు.. గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ప్రియాంక అక్కడే నిరాహార దీక్షకు దిగినట్టు పార్టీ వెల్లడించింది(congress lakhimpur kheri news).
ప్రియాంకకు మద్దతుగా, బాధిత కుటుంబాలకు సంఘీభావంగా సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు నిరసనల్లో పాల్గొన్నారు. మంగళవారం దేశంలో ఉన్న అన్ని జిల్లాల్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రను తొలగించాలని, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
ఇదీ చూడండి:- ప్రియాంక 'గాంధీగిరి'.. హౌస్ అరెస్ట్ వేళ చీపురు పట్టి...
పంజాబ్ నేతలు మంగళవారం లఖింపుర్‌కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ స్వయంగా లఖింపుర్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆమ్ఆద్మీ, శిరోమణి అకాళీ దళ్లు కూడా మంగళవారం తమ బృందాలను పంపించనున్నట్టు ప్రకటించాయి. అయితే.. లఖింపుర్‌కు వచ్చేందుకు పంజాబ్ సీఎం సహా ఎవరికీ అనుమతి లేదని యూపీ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
హింసాత్మక ఘటన, అనంతర పరిణామాల నేపథ్యంలో భాజపాపై మండిపడ్డాయి విపక్షాలు. లఖింపుర్‌కు వెళ్లే రాజకీయ నేతలను అడ్డుకునే హక్కు భాజపా ప్రభుత్వానికి లేదని సీపీఎం ధ్వజమెత్తింది.
కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది ఆప్. ఘటనపై దర్యాప్తు సజావుగా జరగాలంటే.. కేంద్రమంత్రిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
'రైతుల తప్పేమీ లేదు..'
హింసాత్మక ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది ఆర్ఎస్ఎస్ అనుబంధ బీకేఎస్(భారతీయ కిసాన్ సంఘ్). ఘటనలో పాల్గొన్న వారు అసలు రైతులే కారని.. వివిధ రాజకీయ పార్టీల మనుషులని ఆరోపించింది. రైతులెప్పుడూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని హత్యలు చేయరని, జరిగిన దాన్ని పరిశీలిస్తే మూఠాల హస్తం ఉన్నట్టు అర్థమవుతుందని వ్యాఖ్యానించింది.
లఖింపుర్‌లో రైతుల దారుణ హత్య ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జోక్యం చేసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. దీని వెనక ఏదో కుట్ర ఉన్నట్టు అనిపిస్తోందని, తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రపతికి లేఖ రాసింది.
భద్రతపై కేంద్రం దృష్టి...
లఖింపుర్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది కేంద్రం. 4 సీఏపీఎఫ్ కంపెనీలతో కూడిన భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం నాటికి మోహరింపు ప్రక్రియ పుర్తవుతుందని స్పష్టం చేసింది కేంద్రం.
ఇదీ చూడండి:- 'రాజకీయాలతో రైతులను అణచివేస్తారా..?'