భూసేకరణలో రూ.కోటి నష్టపరిహారం (up crime news) పొందడం కోసం ఓ వ్యక్తి.. దివంగత ఎంపీలా నటించాడు. తానే ఆ ఎంపీనని అందుకోసం నకిలీ ధ్రువీకరణ పత్రాలు కూడా సమర్పించాడు. అయితే.. పరిహారం చెల్లించే ముందు అధికారులకు అసలు విషయం తెలిసింది. ఈ నాటకీయ సంఘటన సినిమాని తలపిస్తోంది.
ఎలాగంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో రహదారుల విస్తరణలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. అందుకు తగ్గ నష్టపరిహారాన్ని కూడా హక్కుదారులకు ఇస్తోంది. ఈ క్రమంలో రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ప్రేమ్ మనోహర్‌కు చెందిన భూమి (26 ఏకరాలు) కూడా సేకరించింది. అయితే.. తానే ప్రేమ్ మనోహర్ని అని ఓ వ్యక్తి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు (పాన్, ఆధార్, బ్యాంకు పాస్‌బుక్, ఓటర్ ఐడీ, చిరునామా) కూడా జిల్లా యంత్రాంగానికి సమర్పించాడు. పరిహారం ఆ వ్యక్తికి ఇవ్వడానికి రూ.84 లక్షలను అధికారులు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే అధికారులకు అసలు నిజం తెలిసింది.
2013లోనే మృతి..
ప్రేమ్ మనోహర్ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి (1968-74, 1977-80) రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. జాతీయ రహదారి 119 వెంట 26 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. 2013లోనే ఆయన మృతి చెందారు.
ఈ విషయం తెలిసిన అధికారులు కంగుతిన్నారు. మనోహర్ కుమారుడు ప్రశాంత్ కుమార్ ద్వారా విషయాన్ని ధ్రువపరుచుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ యంత్రాంగాన్ని ఆదేశించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:అర్ధరాత్రి వేళ కుటుంబంపై కాల్పులు- ఒకరు మృతి