UP Elections 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార పీఠాన్ని కాపాడుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న కమలదళం.. మళ్లీ 'హిందుత్వ' అస్త్రాన్ని ప్రయోగిస్తోంది! మతపరమైన అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. తనకు గట్టి సవాల్ విసురుతున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ని హిందువుల వ్యతిరేక పార్టీగా పేర్కొంటూ విమర్శలతో విరుచుకుపడుతోంది. నిజానికి రాష్ట్రంలో ఈ దఫా ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి నినాదాలతోనే భాజపా ఎన్నికల బరిలో దిగనున్నట్లు తొలుత విశ్లేషణలొచ్చాయి. అయితే ఓబీసీల్లోని పలు సామాజికవర్గాల ఓటర్లు ఎస్పీ వైపు మొగ్గుచూపుతున్నారన్న విశ్లేషణల నేపథ్యంలో.. వారిని తిరిగి తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో భాగంగా కమలనాథులు హిందుత్వ స్వరం పెంచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎస్పీపై గురిపెడుతూ..
BJP Strategy in UP: 2008 నాటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ ఈ నెల 18న ప్రత్యేక న్యాయస్థానమొకటి తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారైనవారిలో యూపీవాసులు కూడా ఉన్నారు. వారిలో ఒకరి తండ్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కలిసి ఉన్న ఫొటోను 19న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ దిల్లీలో బయటపెట్టారు. అధిష్ఠానం నుంచి సంకేతాలు అందడంతో ఆ మరుసటి రోజు నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ జోరు పెంచారు. ఉగ్రవాదుల పట్ల సానుభూతి కలిగి ఉందంటూ ఎస్పీపై పదేపదే విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. నిజానికి ఇన్నాళ్లూ.. కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందని, గూండాలకు రక్షణ కల్పించిందని, యాదవులకే ప్రాధాన్యమిస్తోందని అఖిలేశ్ పార్టీపై కమలనాథులు ఎక్కువగా వాగ్బాణాలు సంధించారు. ఇప్పుడు మాత్రం ప్రధానంగా ఉగ్రవాదంతో ముడిపెడుతూ ఆరోపణలకు దిగుతున్నారు. ముస్లింలకు అనుకూలమైన, హిందువులకు వ్యతిరేకమైన పార్టీగా ఎస్పీపై ముద్ర వేసేందుకే వారు పంథా మార్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మోదీ వ్యాఖ్యలతో..!
గత ఏడాది డిసెంబరులో వారణాసిలో కాశీ విశ్వనాథ్ నడవా ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అనేక అకృత్యాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఔరంగజేబు విధ్వంసంతోపాటు శివాజీ మహారాజ్ పరాక్రమాన్నీ భారతావని చూసిందని వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికలను హిందువులు, ముస్లింల మధ్య పోరుగా చిత్రీకరించే ప్రయత్నాల్లో భాగంగానే మోదీ ఆ వ్యాఖ్యలు చేశారని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు.
యోగి దూకుడు
UP Elections Updates: ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించిందని సీఎం యోగి ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో రంజాన్ వంటి ముస్లింల పర్వదినాల్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేదని.. హోలీ, దీపావళి వంటి పండగలకు మాత్రం కోతలు ఉండేవని పేర్కొంటున్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటినుంచి అయోధ్యలో దీపోతవ్సవం, మథురలో రంగోత్సవం, కాశీలో దేవ దీపావళిని ఘనంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేస్తున్నారు. ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఖబ్రిస్థాన్(ముస్లిల శ్మశానవాటిక)ల ప్రహరీలకే అధికంగా నిధులు కేటాయించిందని.. ఇప్పుడు అక్కడికే వెళ్లి ఓట్లు అడుక్కోవాలని పలుమార్లు అఖిలేశ్‌ను ఉద్దేశించి యోగి వ్యాఖ్యానించారు. యూపీ తాజా ఎన్నికలను '80% వర్సెస్ 20%'గా ఆయన అభివర్ణించడంపై కూడా పెద్దయెత్తున చర్చ నడిచింది. రాష్ట్రంలో దాదాపు 20%గా ఉన్న ముస్లింలను ఉద్దేశించే ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషణలొచ్చాయి.
కొందరు అభ్యర్థులూ..
భాజపా తరఫున ఎన్నికల బరిలో ఉన్న కొంతమంది అభ్యర్థులూ ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే.. ముస్లింలు నుదుటన 'తిలకం' ధరించేలా చేస్తానని డుమరియాగంజ్ స్థానంలో పోటీ చేస్తున్న రాఘవేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ముస్లింలు 'రాధే రాధే' అని జపించేలా చేస్తానని, లేదంటే పాకిస్థాన్‌కు వెళ్లిపోయేలా వారిపై ఒత్తిడి తెస్తానని అమేఠీలో బరిలో ఉన్న మయాంకేశ్వర్ సింగ్ పేర్కొన్నారు.
ఓబీసీలకు దగ్గరయ్యేందుకే..!
భాజపాకు అగ్రవర్ణాల ఓటర్లు దశాబ్దాలుగా అండగా నిలుస్తున్నారు. వారితోపాటు ప్రధానంగా యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితులు అండగా నిలవడంతో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే- తాజా ఎన్నికల్లో అఖిలేశ్ వ్యూహాత్మకంగా ఆర్‌ఎల్‌డీ, మహాన్‌దళ్, ఎస్‌బీఎస్‌పీ వంటి ఏడు చిన్న పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటుచేశారు. అవన్నీ వివిధ సామాజికవర్గాల మద్దతుతో మనుగడ సాగిస్తున్నవే. అదే సమయంలో స్వామిప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ వంటి కీలక ఓబీసీ నేతలు ఎన్నికలకు ముందు భాజపాను వీడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసిన పలు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందినవారిలోనూ 75-80% మంది కుల/మత సమీకరణాలను పక్కనపెట్టి ఓటేసేందుకు విముఖంగా ఉన్నట్లు విశ్లేషణలొస్తున్నాయి. ఇక రాష్ట్రంలో రహదారుల, బైపాస్‌ల నిర్మాణం రూపంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినా.. వాటితో పేదలకు ఒరిగిందేమీ లేదని, కాంట్రాక్టర్లు/ప్రజాప్రతినిధులే ఎక్కువగా లాభపడ్డారని ఆరోపణలున్నాయి. యూపీలో 2017 ఎన్నికల్లో భాజపా తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 42% మంది.. అగ్రవర్ణాలకు చెందినవారు, వైశ్యులు. పార్టీలో ఓబీసీ శాసనసభ్యుల వాటా కేవలం 24%. యోగి కేబినెట్‌లో కీలక మంత్రిత్వ శాఖలు అగ్రవర్ణాలవారికే దక్కినట్లు విమర్శలున్నాయి. కులగణన డిమాండ్‌ను రాష్ట్ర సర్కారు అణచివేస్తోందని స్వపక్షంలోని ఈబీసీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా ఓబీసీలు పార్టీ నుంచి దూరం జరిగి, గత ఎన్నికల నాటి తమ గెలుపు సమీకరణం దెబ్బతినే ముప్పుందని భాజపా గ్రహించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే మళ్లీ కుల/మతాల లెక్కలు, హిందుత్వ గళంతో ఆయా వర్గాలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: 'దేశభక్తికి.. కుటుంబ భక్తికి చాలా తేడా ఉంది'