UP election second phase: ఉత్తర్‌ప్రదేశ్ రెండో దశ ఎన్నికలకు వేళయింది. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 586 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
UP election muslim votes
రెండో దశ జరిగే స్థానాల్లో ముస్లింలదే హవా. సహారన్‌పుర్, రాంపుర్ తదితర జిల్లాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. సాధారణంగా ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పట్టుంది. ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం. చెరకు బకాయిల అంశం ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో మొదటిదశ పోలింగ్‌తో పోలిస్తే భాజపా గట్టి పోటీ ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు ఉన్నాయి.
UP election SP BJP
గతంలో ఈ ప్రాంతంలో ముస్లిం, జాట్, దళిత ఓటర్ల కూటమి ఫార్ములా విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈసారి ఎస్పీ.. ఆర్‌ఎల్‌డీ, మహాన్‌దళ్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ కూర్పు కారణంగా జాట్ ఓట్లపై ఆర్‌ఎల్‌డీ ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. బదాయూ, సంభల్ జిల్లాల్లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబ ప్రభావం ఎక్కువే.
భాజపాకు గట్టిపోటీ..
కైరానా, ముజఫర్‌నగర్ అల్లర్ల అంశాలు 2017లో భాజపా విజయావకాశాలను ప్రభావితం చేశాయి. ఈ ఘర్షణలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో కమలం పార్టీ సఫలమైంది. ఈసారి ఆ పరిస్థితి లేదు. చెరకు బిల్లుల చెల్లింపుల అంశం కూడా ఓటింగ్ సరళిని ప్రభావితం చేయనుంది. దీనికి తోడు కేంద్ర వ్యవసాయ చట్టాలు.. అనంతర పరిణామాలు కూడా యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు వ్యతిరేకమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ అంశం కూడా కీలకమే. ఇలాంటి కారణాల నేపథ్యంలో రెండోదశలో భాజపాకు అగ్నిపరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ముస్లిం ఓట్లను చీల్చగలిగితే భాజపాకు లాభం కలిగే అవకాశం ఉంది.
రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో దళితులు 20 శాతంగా ఉన్నారు. వీరి ఓట్లు ఎటువైపు పడతాయనే అంశంపై పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఇలా..
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 55 స్థానాల్లో భాజపా 38 గెలుచుకుంది. సమాజ్‌వాదీ 15 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు స్థానాలకు పరిమితమైంది. సమాజ్‌వాదీ గెలుపొందిన 15 స్థానాల్లో 10 మంది ముస్లింలే కావడం గమనార్హం.
పోలింగ్ సమయం
- ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
కీలక వ్యక్తులు...
- సమాజ్‌వాదీకి చెందిన మహమ్మద్ ఆజాంఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఖాన్.
- రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేశ్ ఖన్నా
- యోగి సర్కారులో మంత్రిగా పనిచేసి ఎస్పీలో చేరిన ధరం సింగ్ సైనీ.
- బల్దేవ్ సింగ్ ఔలాక్- జల్‌శక్తి మంత్రి
- మహేశ్ చంద్ర గుప్తా- రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ
- గులాబ్ దేవి- సెకండరీ విద్యా శాఖ మంత్రి
- సుప్రియా ఆరోన్(బరేలీ కంటోన్మెంట్)
- కీరత్ సింగ్ గుజ్రార్(గంగోహ్)
- దేవేంద్ర నాగ్‌పాల్(నౌగాన్ స్థానం)
ఇదీ చదవండి: