ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ 22 ఏళ్ల దళిత యువకుడిపై ఆమె కుటుంబ సభ్యులు క్రూరంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినప్పుటికీ ప్రాణాలు దక్కలేదు.
"వేరే కులానికి చెందిన 20ఏళ్ల మహిళతో పవన్ కుమార్ అనే వ్యక్తికి కొన్నాళ్లుగా సంబంధం ఉంది. శుక్రవారం రోజు రాత్రి తనని కలవమని ఆమె చెప్పింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లిన పవన్‌ను కట్టేసి, ఆమె కుటుంబ సభ్యులు కర్రలతో దారుణంగా కొట్టారు. అతని అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అతణ్ని ఆసుపత్రి తరలించగా.. అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించాం."
- బహదూర్ భదౌరియా, రసూల్‌పుర స్టేషన్‌హౌస్ ఆఫీసర్
మహిళ తండ్రి సహా ఇతర కుటుంబ సభ్యులు నేరాన్ని అంగీకరించారని భదౌరియా తెలిపారు. ప్రియురాలి తండ్రి సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదైంది. మహిళతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించనున్నారు. ఇంకో ఇద్దరు పరారీలో ఉన్నారు.
అయితే పవన్‌కు, మహిళకు కొన్ని నెలలుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. వారి సంబంధాన్ని ఆమోదించని ఆమె కుటుంబ సభ్యులు తన నుంచి దూరంగా ఉండమని అతడిని గతంలో హెచ్చరించినట్లు సమాచారం.
ఇదీ చూడండి: భర్తకు సెల్ఫీ వీడియో పంపి భార్య ఆత్మహత్య