UP assembly election 2022: ఉత్తర్‌ప్రదేశ్ చివరి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడతలో పూర్వాంచల్‌లోని 54 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 వరకు కొనసాగింది. చందౌలీ నియోజకవర్గంలోని చకియా, సోన్‌భద్రలోని రాబర్ట్స్‌గంజ్, దుద్ది ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 54.18 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
UP election final phase:
ఎన్నికలు జరిగిన 54 స్థానాల్లో 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలోనూ ఈ విడతలోనే ఎన్నికలు జరిగాయి. మొత్తం 2.06 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్నారు.
దీంతో, 403 స్థానాలు ఉన్న యూపీ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి.
కీలక నేతలు..
చివరి దశ పోలింగ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ పర్యటక శాఖ మంత్రి నీల్‌కంఠ్ తివారీ బరిలో ఉన్నారు. ఈయన వారణాసి సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మరోవైపు శివ్‌పుర్-వారణాసి నియోజకవర్గం నుంచి అనిల్ రాజ్‌భర్, వారణాసి నార్త్ నుంచి రవీంద్ర జైస్వాల్, జౌన్‌పుర్ నియోజకవర్గం నుంచి గిరీష్ యాదవ్, మిర్జాపుర్ నుంచి రామశంకర్ సింగ్ పటేల్ పోటీ చేశారు. కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన ధారాసింగ్ చౌహాన్.. ఘోశి నుంచి బరిలో నిలిచారు.
ఇదీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికపై.. ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం ఎంత?