UP ASSEMBLY ELECTION 2022: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం జరగనున్న శాసనసభ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9 జిల్లాల పరిధిలోని 54 శాసనసభ స్ధానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. 613 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, 2కోట్ల 6లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. సోమవారం ఎన్నికలు జరగనున్న స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసి పరిధిలోని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
2017 శాసనసభ ఎన్నికల్లో 54 స్థానాల్లో భాజపా, దాని మిత్రపక్షాలు 36 స్థానాలు గెల్చుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 11, బహుజన సమాజ్ పార్టీ 6 సీట్లలో విజయం సాధించాయి. సోమవారంతో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.
పోటీలో ప్రముఖులు...
చివరి దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి నీల్‌కాంత్ తివారీ ఉన్నారు. ఈయన వారణాసి సౌత్ నియోజక వర్గం నుంచి పోటీలో ఉన్నారు. మరోవైపు శివ్‌పుర్-వారణాసి నియోజక వర్గం నుంచి అనిల్ రాజ్‌భర్, వారణాసి నార్త్ నుంచి రవీంద్ర జైస్వాల్, జౌన్‌పుర్ నియోజకవర్గం నుంచి గిరీష్ యాదవ్, మీర్జాపుర్ నుంచి రామశంకర్ సింగ్ పటేల్‌లు పోటీపడుతున్నారు. అంతేగాకుండా క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన ధారాసింగ్ చౌహాన్ ఘోశి నుంచి పోటీలో ఉన్నారు.
ఇదీ చూడండి:
'భారత్ శక్తిమంతంగా మారుతున్నందునే ఆపరేషన్ గంగా సక్సెస్'
పుణె మెట్రో రైల్ ప్రాజెక్టుకు మోదీ శ్రీకారం.. ట్రైన్లో ప్రయాణం