దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచారం కేసు బాధితురాలి ఇంటికి ఇద్దరు నిందితులు నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధిత దళిత బాలిక ఇంటికి అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు నిప్పు పెట్టారు. ఈ దారుణ ఘటనలో బాధిత బాలిక ఆరు నెలల కుమారుడు, రెండు నెలల వయసున్న బాలిక చెల్లి తీవ్ర గాయాలపాలయ్యారు.
ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఉన్నావ్ అత్యాచార కేసు నిందితులు మరో ఐదుగురితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లారు. అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలని వారిని అడిగారు. అందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని పోలీసులు తెలిపారు. ఈ నిరాకరణతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న నిందితులు బాధితురాలిపై దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టారని పోలీసులు వివరించారు.
2022 ఫిబ్రవరి 13న అప్పటికి 11 ఏళ్ల వయసున్న బాలికపై అత్యాచారం జరగగా.. సెప్టెంబరు నెలలో ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. ఆ చిన్నారిని అంతమొందించడానికే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాలిక తల్లి ఆరోపించారు. బాధితురాలైన తమ కుమార్తెను అంతమొందించడానికే నిందితులు.. తమ ఇంటికి నిప్పు పెట్టారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"నా కూతురికి మళ్లీ అన్యాయం జరిగింది. నెల రోజుల క్రితం జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నిందితుల్లో అమన్, సతీశ్.. కొందరు వ్యక్తులతో కలిసి మా ఇంటికి వచ్చారు. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కేసు వెనక్కి తీసుకోకుంటే చంపేస్తామని బెదిరించారు. కర్రలతో దాడి చేశారు" అంటూ బాధితురాలి తల్లి ఆరోపణలు చేశారు.
ప్రస్తుత దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను మెరుగైన చికిత్స కోసం కాన్పుర్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 13న జరిగిన మరో ఘటనలో నిందితుల తరపున మాట్లాడుతున్న బాధితురాలి తాత, మరో బంధువు... తమ భర్తపై గొడ్డలితో దాడి చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎం అపూర్వ దుబె ఆదేశాల మేరకు ఏడీఎం నరేంద్ర సింగ్.. చిన్నారులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. కాలిన గాయాలతో ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. తాము అరుపులు విని.. బాధితురాలి ఇంటికి చేరుకున్నామని స్థానికులు తెలిపారు. అప్పటికే చిన్నారులు సగానికి పైగా కాలిపోయారని చెప్పారు.