భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు తమకు నాయకుడు ఉన్నాడని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అదే సమయంలో పార్టీ అభివృద్ధిని చేసే ఉద్దేశాలు కూడా తమ వద్ద ఉన్నాయని.. విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భాజపా.. ఇతర పార్టీల మాదిరి కాదని ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో ఏర్పాటుచేసిన 'పార్టీ బూత్ ప్రెసిడెంట్ కాన్ఫరెన్స్' సందర్భంగా చెప్పుకొచ్చారు నడ్డా. భాజపా మినహా తక్కిన పార్టీలన్నింటిలోనూ 'పరివార్వాద్(వారసత్వ రాజకీయాలు)' కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే.. తమ పార్టీలో మాత్రం ఓ సాధారణ వ్యక్తి.. ప్రధాని, రక్షణ, హోం మంత్రి లాంటి ఉన్నత పదవులు చేపడతారని ఉద్ఘాటించారు.
"మాకు... 'నేత(నాయకుడు)', 'నియత్(ఉద్దేశం)', 'విధానం', 'కార్యకర్త', 'కార్యక్రమం' ఉన్నాయి. వీటన్నింటితోనే మా పార్టీ ముందుకెళుతోంది. అయితే.. ఈ నియమం ఇతర రాజకీయ పార్టీలలో లేదు. వారు వారసత్వంగా అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు."
- జగత్ ప్రకాశ్ నడ్డా, భాజపా అధ్యక్షుడు.
హాజరైన సీఎం..
ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. భాజపా.. ఇతర పార్టీలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని చెప్పారు యోగి. రాచరిక పాలన, కులతత్వం, ప్రాంతీయ భేదాలు, భాషా విభజనలు వంటివి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ.. దేశ ఐక్యతకు సవాల్ విసురుతున్నాయన్నారు. మోదీ అద్భుత పాలన కారణంగా.. నేడు ప్రపంచ దేశాలు భారత్‌వైపు ఎంతో ఆశతో చూస్తున్నాయని యోగి తెలిపారు.
ఇదీ చదవండి: తల్లిదండ్రుల్ని పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత!