రైతు సంఘాలతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి తోమర్ తెలిపారు. రైతు సంఘాలతో నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. రైతు సంఘాలు ప్రతిపాదించిన అంశాల్లో రెండింటిపై ఏకాభిప్రాయం కుదిరినట్లు పేర్కొన్నారు.
పర్యావరణ ఆర్డినెన్స్, విద్యుత్ చట్టం అంశాలపై రైతు సంఘాలు చేసిన ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తోమర్ చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చే విద్యుత్ రాయితీల విషయంలో కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు.
మద్దతు ధర అంశాన్ని చట్టంలో చేర్చాలని రైతు సంఘాలు కోరగా.. దానిపై లిఖిత పూర్వక హామీ ఇస్తామని చెప్పినట్లు తోమర్ వివరించారు. దిల్లీలో చలి దృష్ట్యా ఆందోళనలో పాల్గొంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లలను ఇంటికి పంపాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు.