బంగాల్లో భాజపా అధికారంలోకి వస్తే.. భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి కేంద్ర బిందువైన సింగూర్ను వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. త్వరతగతిన పారిశ్రామికీకరణ జరిగేలా చర్యలు చేపడతమన్నారు. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
సింగూర్ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి రవీంద్రనాథ్ భట్టాచార్య తరఫున ఎన్నికల ప్రచారం చేసిన షా.. రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు సీఎం మమతా బెనర్జీ ఆటంకంగా మారారని ఆరోపించారు. అందువల్లే ఉద్యోగవకాశాలు తగ్గిపోయాయన్నారు.
అనంతరం.. హౌవ్డాజిల్లాలోని రోడ్ షోలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి.. భాజపా 200 సీట్లుకుపైగా విజయం సాధించి, భారీ మెజారిటీతో కమల దళం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటివరకు మూడదశల్లో 91 స్థానాలకు ఎన్నికలు జరగగా.. వాటిలో భాజపా 63 నుంచి 68 స్థానాల్లో గెలుస్తుందన్నారు షా.
"నేను గ్రామ పంచాయితీ స్థాయిలో పర్యటించాను. అక్కడి ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. మే 2న 200 సీట్లుకుపైగా గెలుపొంది.. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మమత బెనర్జీ ప్రసంగం, ప్రవర్తనలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
రిక్షా కార్మికుడి ఇంట్లో షా విందు..
దోమ్జుడ్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి రజిబ్ బెనర్జీ తరఫున ప్రచారం చేసిన అమిత్ షా.. ఓ రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేశారు. ఆయనతో పాటు రజిబ్ బెనర్జీ కూడా విందు స్వీకరించారు.
ఇదీ చూడండి: 'షా ఆదేశాలతోనే.. ఓటర్లపై జవాన్ల వేధింపులు'