కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ పూర్తయ్యాక పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) బంగాల్లో అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సీఏఏ కింద బంగాల్లోని శరణార్థులతో పాటు మతువా సామాజిక వర్గానికి భారత పౌరసత్వం ఇస్తామని పేర్కొన్నారు. సీఏఏ విషయంలో మైనార్టీలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. బంగాల్లోని ఠాకూర్ నగర్లో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువస్తామని 2018లో భాజపా మాటిచ్చింది. అన్నట్టుగానే 2019లో గెలిచిన తర్వాత తీసుకువచ్చింది. సీఏఏని బంగాల్లో అమలుచేయనివ్వబోమని మమతా బెనర్జీ అన్నారు. కానీ మేం అమలు చేసి తీరుతాం. సీఏఏను అడ్డుకోవడానికి ఎన్నికల తర్వాత ఆమె అధికారంలో ఉండరు. ఇక్కడికి భారీగా తరలి వచ్చిన మతూవా సామాజికవర్గాన్ని చూస్తే వచ్చే ప్రభుత్వం భాజపాదేనని కచ్చితంగా చెప్పగలను. కొన్ని అనివార్య కారణాల వల్ల ముందు అనుకున్నట్లుగా ఇక్కడికి రాలేకపోయాను. నేను రానందుకు మమతా దీదీ సంతోషించి ఉంటారు."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఏప్రిల్‌లో ఎన్నికలు కాబట్టి.. అప్పటి వరకు చాలా సమయం ఉందని, మళ్లీ మళ్లీ బంగాల్కి వస్తానని అమిత్ షా అన్నారు. మమత ఓడిపోయే వరకు వస్తూనే ఉంటానని తెలిపారు.
ఒడిశా, తెలంగాణలోనూ..
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పోరాటం... మమతా బెనర్జీని గద్దె దించటానికి మాత్రమే కాదని, బంగాల్‌ను స్వర్ణ బంగ్లాగా మార్చేందుకేనని అమిత్ షా పేర్కొన్నారు. మూడింట రెండో వంతు మెజార్టీతో తాము అధికారం చేపడతామని అన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన భాజపా సమాజిక మాధ్యమ ప్రచార కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బంగాల్ విజయం.. ఒడిశా, తెలంగాణల్లో భాజపా అధికారంలోకి వచ్చేందుకు బాటలు పరుస్తుందని అన్నారు.
ఇదీ చూడండి: కేరళలో 'బ్యాక్ డోర్' రాజకీయం- విజయన్‌కు కష్టమే!