ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) కేవలం ఒక ఆశగానే మిగిలిపోకూడదని దిల్లీ హైకోర్టు(Delhi High Court) వ్యాఖ్యానించింది. అది అమల్లోకి రావాలని ఆకాంక్షించింది. "ఆధునిక భారత సమాజం క్రమంగా ఏకజాతిగా రూపుదిద్దుకుంటోంది. కులం, మతం, వర్గం వంటి సంప్రదాయ అడ్డుగోడలు మెల్లగా తొలగిపోతున్నాయి. కాబట్టి యూసీసీ అనేది కేవలం ఓ ఆశగా ఉండిపోకూడదు" అని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఈనెల 7న ఓ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వివాహం, విడాకులకు సంబంధించి వేర్వేరు 'పర్సనల్ లా'ల మధ్య ఉండే విభేధాల కారణంగా భారతీయ యువత ఇబ్బందిపడే పరిస్థితులు ఉండకూడదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. యూసీసీ ఆవశ్యకతను సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో నొక్కిచెప్పిన సంగతిని గుర్తుచేశారు. అయితే.. యూసీసీని ప్రవేశపెట్టే దిశగా ఏ మేరకు అడుగులు పడ్డాయనే దానిపై స్పష్టత లేదన్నారు. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర న్యాయశాఖను ఆదేశించారు.
'మీనా' అనే వర్గానికి చెందిన వ్యక్తుల వివాహాలకు హిందూ వివాహ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఉందా అనే అంశంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇదీ చూడండి: Sedition: ఆ పోలీసు అధికారిపై దేశద్రోహం కేసు!