జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఎన్కౌంటర్ జరిగింది. పుచల్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. అదే సమయంలో కుల్గాం ప్రాంతంలో లష్కరే తొయిబా ఉగ్రసంస్థతో సంబంధాలున్న మరో ఇద్దరు ముష్కరులను భద్రతదళాలు హతమార్చాయి.
దీంతో గడిచిన 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి నష్టం జరగకుండా ఎన్కౌంటర్ జరిపినందుకు సిబ్బందిని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ అభినందించారు.
సైన్యం, స్థానిక పోలీసులు కలిసి వేర్వేరు ప్రాంతాల్లో నిర్బంధ సోదాలు నిర్వహిస్తుండగా.. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇంకా ముష్కరుల వేట కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.