ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్యాక్టరీలో పనిచేసే ఓ యువతిని విహారయాత్రకు తీసుకెళ్తానని నమ్మించి.. ఆమె పొరుగింట్లో ఉండే వ్యక్తి రూ.2 లక్షలకు అమ్మేశాడు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌లోని రోహ్తస్ జిల్లాకు చెందిన బాధితురాలు.. హరిద్వార్‌లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే ఆమె పొరుగింట్లో ఉండే రాజ్‌కుమార్ అనే వ్యక్తితో బాధితురాలు క్లోజ్‌గా ఉండేది. ఆమెను మామ అని పిలిచేది. అయితే ఓ రోజు విహారయాత్రకు తీసుకెళ్తానని చెప్పి బాధితురాల్ని రాజ్‌కుమార్.. యూపీలోని సహరాన్‌పుర్ జిల్లాకు తీసుకెళ్లాడు. అక్కడ నీతు గుర్జార్ అనే వ్యక్తికి రూ.2 లక్షలకు అమ్మేశాడు. ఆ తర్వాత బాధితురాల్ని బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించాడు నీతు గుర్జార్. అందుకు ఆమె నిరాకరించడం వల్ల రెండు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం బాధితురాలు.. నీతు గుర్జార్ బారి నుంచి తప్పించుకుని హారిద్వార్ చేరుకుంది. సిడ్‌కుల్ పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితురాలు దెహ్రాదూన్‌కు వెళ్లి డీఐజీ గర్వాల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే డీఐజీ ఆదేశాల మేరకు సిడ్‌కుల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర జిల్లాలో దారుణం జరిగింది. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ భార్య. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడి భార్యపై కేసు నమోదు చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. జిల్లాలోని కోసికల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీనానగర్‌లో నివాసముంటున్నారు చమన్ ప్రకాష్, రేఖ దంపతులు. అయితే తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని చమన్ ప్రకాష్ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో వారిద్దరూ రోజూ గొడవ పడేవారు. సోమవారం భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రేఖ తన భర్త చమన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రగాయాలతో చమన్‌ను అతడి బంధువులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. చమన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
13 ఏళ్ల బాలుడి బైక్ డ్రైవ్.. చిన్నారి మృతి
తమిళనాడులోని విజయమానగరంలో విషాదం నెలకొంది. బైక్ నడుపుతున్న ఓ 13 ఏళ్ల బాలుడు.. మూడేళ్ల చిన్నారిని బలంగా ఢీకొట్టాడు. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలుడితో పాటు అతడి తండ్రిపై కేసు పెట్టారు. బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాలుడ్ని కడలూరు జువైనల్ రిఫార్మ్ స్కూల్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: ఆటో, బస్సు ఢీ.. 9 మంది మృతి.. అందరూ రోజువారీ కూలీలే
వరదలో మునిగిన కారు.. లోపల ఇద్దరు.. అందరిలోనూ టెన్షన్.. చివరకు..