కరోనాపై పోరులో భాగంగా భారత్‌లోని తమ బృందం.. ప్రభుత్వ అధికారులకు సహాయం చేస్తున్నట్టు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి వెల్లడించారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నట్టు స్టీఫెన్ డుజెర్రిక్ పేర్కొన్నారు.
నమ్మదగిన, జీవితాల రక్షణకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడం కోసం గతేడాది మే నెలలో 'వెరిఫైడ్' కార్యక్రమాన్ని ప్రారంభించారు గుటెరస్. ప్రస్తుతం భారత్‌లో దీని అమలు కోసం విస్తృతంగా కృషి చేస్తున్నట్టు డుజెర్రిక్ వెల్లడించారు.
మరోవైపు దేశంలో జాతీయ టీకా వ్యూహాలకు సంబంధించి యూనిసెఎఫ్ సహాయం చేస్తున్నట్టు గుటెరస్ ప్రతినిధి స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని అందించే విధంగా 6,50,000మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ విధంగా ఇప్పటివరకు 21మిలియన్ మందికి చేరువైనట్టు వెల్లడించారు.
గ్రామీణ భారతంలోని 17 మిలియన్ మందికి చేరువయ్యేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ రేడియో స్టేషన్లతో కలిసి పనిచేస్తున్నట్టు డుజెర్రిక్ తెలిపారు.
అదే సమయంలో ఉత్తర భారతం, మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో 25 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సహాయం చేస్తున్నట్టు వివరించారు డుజెర్రిక్.
ఇదీ చూడండి:- '80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'