Evacuation flights: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన 'ఆపరేషన్ గంగ' ను వేగవంతం చేసింది కేంద్రం. ఇప్పటికే పలు విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. వాయుసేన సైతం రంగంలోకి దిగింది. రానున్న రోజుల్లో మొత్తం 31 విమానాల ద్వారా.. 6,300 మందికిపైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
"ఆపరేషన్ గంగలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, స్పైస్‌జెట్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు భాగం కానున్నాయి. మార్చి 2 నుంచి రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి 21, హంగెరీలోని బుడాపెస్ట్ నుంచి 4, పోలండ్‌లోని ర్జెస్జో నుంచి 4, స్లోవేకియాలోని కొసిసే నుంచి ఒక విమానం భారతీయులను తరలించేందుకు షెడ్యూల్ చేశాం. బుకారెస్ట్ నుంచి భారత వాయుసేన పౌరులను స్వదేశానికి తీసుకొస్తుంది. మొత్తంగా మార్చి 2 నుంచి 8 తేదీల మధ్య 31 విమానాల ద్వారా 6,300 మందిని తరలించనున్నాం."
- అధికార వర్గాలు.
ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్ సుమారు 180మంది సామర్థ్యం, ఎయిర్ఇండియా, ఇండిగోలు 250, 216 ప్రయాణికుల సామర్థ్యంతో విమానాలను నడపనున్నాయని అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటి వరకు 9 విమానాల్లో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు చెప్పారు అధికారులు. మరో 5-6 విమానాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆపరేషన్ గంగాలో భాగంగా ఒక్కరోజే 6 విమానాల్లో మొత్తం 1,377 మంది భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. అంతకు ముందు రోజు.. 2వేల మంది భారత్‌కు చేరుకున్నారని, మరో 4-5వేల మంది సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ సెక్రెటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.
ఇదీ చూడండి: ఉక్రెయిన్ నింగిపై పట్టు కోసం రష్యా తిప్పలు.. బాంబులు లేవా?