UIDAI Warning To Aadhaar Users : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. ఎప్పటికప్పుడు ఆధార్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే కొన్నిరోజుల క్రితం.. పదేళ్లు దాటితే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోమని యూఐడీఏఐ సూచించింది. దీంతో కొందరు దగ్గర్లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటుండగా.. మరికొందరు ఆన్‌లైన్‌లో తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే సైబర్ నేరగాళ్లు.. ఆధార్ అప్డేట్ మాటున పంజా విసురుతున్నారట. దీంతో అప్రమత్తమైన UIDAI.. ఆధార్ కార్డు హోల్డర్లకు వార్నింగ్ ఇచ్చింది. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డును అప్డేట్ కోసం పత్రాలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.
'UIDAI అలా ఎప్పుడూ కోరదు'
UIDAI Warns Users : "UIDAI ఎప్పుడూ ముఖ్యమైన డాక్యుమెంట్లను షేర్ చేయమని అడగదు. మీ ఆధార్‌ను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా అప్డేట్ చేయడానికి మీ POI/POA పత్రాలను షేర్ చేయమని మిమ్మల్ని ఎప్పుడూ కోరదు. my Aadhaar Portal ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఆధార్‌ను అప్డేట్ చేసుకోండి లేదా మీకు సమీపంలోని ఆధార్ కేంద్రాలను సందర్శించండి" అని UIDAI సూచించింది.
'నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను మాత్రమే'
Aadhaar New Rules 2023 : గతేడాది ప్రారంభంలో.. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని UIDAI.. ప్రజలు తమ ఆధార్ కార్డుల ఫొటో కాపీలను ఏ సంస్థలతోనూ పంచుకోవద్దని సూచించింది. "ఆధార్ కార్డులో దుర్వినియోగం అయ్యే సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఉంది. కాబట్టి ప్రజలు తమ ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను మాత్రమే ప్రదర్శించేలా ఉపయోగించకోవచ్చు" అని పేర్కొంది.
'సోషల్‌మీడియాలో ఆధార్ ఫొటో పోస్ట్ చేయొద్దు'
Aadhaar Updates : అయితే ఆధార్ కార్డును వివిధ లావాదేవీల్లో వాడుకోవచ్చని.. కానీ ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్), ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయకూడదని UIDAI సూచించింది. ఆధార్‌ను ఉపయోగిస్తున్నప్పుడు శ్రద్ధ వహించాలని పేర్కొంది. 10 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డులను పొంది.. వివరాలను అప్డేట్ చేసుకోని వ్యక్తులు వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని కోరింది.