Udupi College Video Case : కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న నర్సింగ్‌కాలేజీలో ఓ విద్యార్థిని వాష్‌రూంలో ఉండగా.. మరో ముగ్గురు విద్యార్థినులు రహస్యంగా వీడియో తీశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన పోలీసులు.. ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. ఆ ముగ్గురు విద్యార్థినులపై కూడా కేసు నమోదు చేశారు. వారిని షబ్నాజ్, అల్ఫియా, అలీమాగా గుర్తించారు. ఘటన జరిగిన కాలేజీ యాజమాన్యంపైనా ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు విద్యార్థినులు రహస్యంగా వీడియో తీయడంపై యాజమాన్యం ఆధారాలు సమర్పించలేదని వారు వివరించారు.
ఉడుపిలోని నేత్రజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అల్లీడ్ హెల్త్ సైన్సెస్‌లో ఓ విద్యార్థిని వాష్‌రూంకు వెళ్లిన సమయంలో షబ్నాజ్, అల్ఫియా, అలీమా అసభ్యకరంగా వీడియో రికార్డు చేశారు. తర్వాత వీడియోను డిలీట్ చేశారు. విషయం బయటపడటం వల్ల ఆ ముగ్గురు విద్యార్థినులను కాలేజీ నుంచి యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించిన మార్ఫ్‌డ్ వీడియోలను యూట్యూబ్, ట్విట్టర్లో పోస్టు చేసిన వ్యక్తులపైనా.. మత, సమాజ సామరస్యాన్ని చెడగొట్టడం వంటి కేసులను నమోదు చేశారు పోలీసులు.
ప్రస్తుతం ఈ అంశం కర్ణాటకలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బీజేపీ పిలుపునిచ్చింది. అసభ్యకరంగా వీడియో తీసిన ముగ్గురు విద్యార్థినిలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. కాగా ఒక మాతానికి చెందిన అమ్మాయిలు కావాలనే మరోమతానికి చెందిన విద్యార్థిని వీడియో తీశారనే వదంతులను.. ప్రజలెవ్వరూ నమ్మొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
కర్ణాటకకు జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు..
Kushboo Sundar NCW : వాష్‌రూంకు వెళ్లిన విద్యార్థిని వీడియోను.. తోటి విద్యార్థునిలు తీయడంపై జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు కుష్బూ సుందర్ మండిపడ్డారు. తాను ఉడుపి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన చాలా బాధకరమన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటానని కుష్బూ సుందర్ వెల్లడించారు. ఘటన జరిగిన కాలేజ్‌ని సందర్శిస్తానని, విద్యార్థినిలను కలిసి మాట్లాడతానని వివరించారు. పోలీసులతోనూ సమావేశమవుతాని పేర్కొన్నారు. మహిళల గౌరవంతో ఎవ్వరూ ఆడుకోలేరని ఆమె స్పష్టం చేశారు.