Udhayanidhi Stalin On BJP : సనాతన ధర్మం నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. తాజాగా భారతీయ జనతా పార్టీని ఓ విషసర్పంగా అభివర్ణించారు. తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ.. ఆ విషసర్పాలకు ఆశ్రయం కల్పించే చెత్తలా తయారైందని మండిపడ్డారు. పాము ఇంట్లోకి ప్రవేశిస్తే దాన్ని బయటకు వెళ్లగొడితే సరిపోదనీ.. అది మీ ఇంటి పరిసరాల్లోని చెత్తలో దాక్కుని అదను చూసి మళ్లీ ఇంట్లోకే వస్తుందన్నారు.
ఆ చెత్తను తొలగించినప్పుడే ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోతుందని చెప్పారు. అలాగే అన్నాడీఎంకేను నిర్మూలించినప్పుడే బీజేపీ అనే విషసర్పం వెళ్లిపోతుందన్నారు. తాను మారణహోమం సృష్టించాలని అనుకుంటున్నట్లు బీజేపీ చెబుతుందన్న ఉదయనిధి.. నిజమైన మారణహోమం బీజేపీ పాలిత మణిపుర్‌లోనే జరుగుతుందన్నారు.
DMK Raja On Modi : అంతకుముందు డీఎంకే లోక్‌సభ ఎంపీ ఎ రాజా.. ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చారు. అందరు ఆ విషసర్పం కాటు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారని అందుకు సరైన విరుగుడు ద్రవిడమేనని వ్యాఖ్యానించారు. కాగా కొన్ని రోజుల క్రితం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అందులో ఉన్న అస్పృష్యత అంటువ్యాధుల్లా వ్యాపిస్తాయని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రధాని మోదీ కూడా ఈ వ్యాఖ్యలను గట్టిగా ఖండించాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు.
ఇమ్మాన్యుయేల్ శేఖరన్కు స్మారక చిహ్నం..
Immanuel Sekaran Memorial : స్వాంతంత్య్ర సమరయోధుడు ఇమ్మాన్యుయేల్ శేఖరన్ వర్థంతి సందర్భంగా.. ఆయనకు గుర్తుగా రామనాథపురం జిల్లాలోని పరమకుడి వద్ద స్మారక చిహ్నం నిర్మిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మూడు కోట్ల రూపాయలతో ఈ పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. కాగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం మధ్యాహ్నం పరమకుడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు.
ఉదయనిధి స్టాలిన్ వివాదస్ఫద వ్యాఖ్యలు..
Udhayanidhi Stalin Statement : కొద్ది రోజుల క్రితం.. తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ, హిందూ సంఘాలతోపాటు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించాయి. చెన్నైలో జరిగిన తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారుల సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం కాకుండా దాని నిర్మూలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.