డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఒకప్పుడు తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో నిలిచి.. తాతకు తగ్గ మనవడిగా నిలిచారు. డీఎంకే కంచుకోటలో జయకేతనం ఎగరవేశారు.
ఇదే అరంగేట్రం..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధి మనవడు అయిన ఉదయనిధి.. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయితే అరంగేట్రంలోనే కీలక చెపాక్-ట్రిప్లికకేన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించటం విశేషం. ఈ నియోజకవర్గం డీఎంకేకు కంచుకోటగా ఉంది. గతంలో కరుణానిధి ఈ స్థానం నుంచి మూడు సార్లు పోటీ చేసి విజయం సాధించారు.
1996, 2001, 2006లో వరుసగా మూడు సార్లు చెపాక్ నుంచి కరుణానిధి అసెంబ్లీకి వెళ్లారు. ఇందులో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఈ స్థానాన్ని కరుణానిధి కుటుంబం అదృష్టంగా భావిస్తోంది. అయితే 2008లో చెపాక్, ట్రిప్లికేన్ ప్రాంతాలను విలీనం చేశారు. ఆ తర్వాత 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే ఇక్కడ జయకేతనం ఎగరవేసింది.
ఇదీ చూడండి: అజేయుడు ఊమెన్ చాందీ.. 12వ సారి విజయం