తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. బుధవారం ఉదయం ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి.. ఉదయనిధితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్, ఇతర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. ఆయనకు క్రీడల శాఖ బాధ్యతలు అప్పగించారు.
తనను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని కుటుంబ రాజకీయంగా పేర్కొంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఉదయనిధి స్పందించారు. అలాంటి విమర్శలు తనకు కొత్త కాదని, వాటిని సమర్థంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. 'నేను ఇక సినిమాలు చేయను. మామన్నం సినిమానే నా చివరిది. కుటుంబ రాజకీయాలు అంటూ తనపై విమర్శలు చేయడం కొత్తేం కాదు. వాటిని నేను సమర్థంగా ఎదుర్కొంటా. నా పని ద్వారానే వాటికి జవాబిస్తా' అని విలేకరులతో ఉదయనిధి పేర్కొన్నారు.
స్టాలిన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉదయనిధి డీఎంకే (DMK) పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గతేడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో ఈ నియోజకవర్గానికి ఆయన తాత, డీఎంకే అగ్రనేత కరుణానిధి ప్రాతినిధ్యం వహించారు.
ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసిన ఉదయనిధి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయలో విమర్శలు చేసి జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కారు. కరుణానిధి మరణం తర్వాత 2018లో స్టాలిన్ డీఎంకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు, ఆయన పార్టీ యువజన విభాగానికి మూడు దశాబ్దాల పాటు నాయకత్వం వహించారు. స్టాలిన్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత.. యూత్ వింగ్‌ను ఉదయనిధికి అప్పగించారు.
ఉదయనిధి నటుడు కూడా. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రజలకు చేరువయ్యారు. నిజానికి ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కొద్ది నెలల ముందే నిర్ణయం తీసుకున్నా.. కొన్ని సినిమాల ఒప్పందాల కారణంగా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా.. ఉదయనిధిని కేబినెట్‌లోకి తీసుకోవడంపై ప్రతిపక్ష అన్నాడీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. వారసత్వ రాజకీయాలకు డీఎంకే స్వస్తి పలకాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.