జమ్ము కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. సరిహద్దు జిల్లా అయిన రాజౌరీలోని బథూని-దిలోగ్రా సమీపంలో శక్తిమంతమైన ఐఈడీని గుర్తించారు. జమ్ము-రాజౌరీ జాతీయ రహదారిపై ఓ కల్వర్టు కింద ఈ ఐఈడీని ఉగ్రవాదులు అమర్చారు.
ఆర్మీకి చెందిన బాంబ్ స్క్వాడ్.. బాంబును సురక్షితంగా కల్వర్టు నుంచి తొలగించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.10 గంటలకు ఐఈడీని నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు.
బాంబు బయటపడ్డ నేపథ్యంలో జమ్ము జాతీయ రహదారి సహా కీలకమైన రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. రాత్రి సమయంలో ఉగ్రవాదులే వీటిని పాతిపెట్టి ఉంటారని ఓ అధికారి చెప్పారు. ఇందుకు కారకులైన వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు.
ఎన్కౌంటర్
మరోవైపు, కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలోని నాగ్బేరన్-తార్సర్ అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పుులు జరిగాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
మృతి చెందినవారిలో ఒకరిని జైషే మహమ్మద్‌కు చెందిన కీలక ఉగ్రవాది మహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూగా గుర్తించినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇతను మసూద్ అజర్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పారు. లెత్పోరా దాడికి కుట్రపన్నిన వారిలో లంబూ కూడా ఉన్నాడని వెల్లడించారు. ఎన్కౌంటర్లో మరణించిన మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
కాగా, భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.