1922 ఆగస్టు 22న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) రుద్రాభిషేకం, శివ జాగారం చేసి బయల్దేరారు. తన అనుచరులందరినీ సమాయత్తపరిచి, రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషన్‌పై(attack on police station) మెరుపుదాడి చేయబోతున్నామని చెప్పారు. ఆత్మరక్షణకు, రణరంగంలో వినియోగించడానికి, తాను చేయదలచుకున్న దీర్ఘకాల పోరాటానికి ఆయుధాలు అవసరం కాబట్టి వాటి సేకరణ మొదలు పెట్టాలని సూచించారు. బ్రిటిష్ సైనికులను ఎదుర్కోవాలంటే గిరిజనుల వద్ద ఉన్న సంప్రదాయ విల్లంబులు, ఆయుధాలు సరిపోవని భావించి ఆధునిక ఆయుధాలను సమీకరించుకోవడం కోసం గిరిజనులతో కలిసి పోలీసు స్టేషన్లపై సాయుధ దాడులకు సిద్ధపడ్డారు. ఈ దాడుల్లో ఆయనతో పాటు ప్రధాన అనుచరులు గాం మల్లుదొర, గంటందొర, ఎండు పడాలు, ఎర్రేసులతో పాటు సుమారు 300 మంది నాటు తుపాకులు, కత్తులు, బల్లేలు, విల్లంబులతో దాడి చేశారు.
ఆ సమయంలో చింతపల్లి స్టేషనులో కేవలం ముగ్గురు జవాన్లే ఉన్నారు. దాడికి ముందే నర్సీపట్నం వైపు వెళ్తున్న సబ్ ఇన్‌స్పెక్టరు లంబసింగి దగ్గర ఎదురుపడగా 'ఆయుధాల కోసం మీ స్టేషన్‌కే వెళ్తున్నాను' అని రామరాజు చెప్పగా అతడు మారు మాట్లాడక తప్పుకొన్నాడు. ఈ దాడిలో 11 తుపాకులు, 1390 తుపాకీ గుళ్లు, ఐదు కత్తులు, 14 బాయ్‌నెట్లను దాడిలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌స్టేషన్ డైరీలో రాసి అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు. దాంతో స్టేషన్‌లో ఉన్న జవాన్లు నిశ్చేష్టులై ప్రతిఘటించకుండా ఉండిపోయారు. రామరాజు సైన్యం తిరిగి వెళ్తుండగా జవాన్ల వద్ద ఉన్న తుపాకీ, తూటాలనూ స్వాధీనం చేసుకున్నారు.
అల్లూరి బరి.. చింతపల్లి
1922 ఆగస్టు 22 నుంచి 27 వరకు వరుసగా ఐదు రోజులపాటు అల్లూరి నేతృత్వంలో ఈ దాడులు చేశారు. చింతపల్లి పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఆ మర్నాడే ఆగస్టు 23న కృష్ణదేవిపేట, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి, ఆ తర్వాత వరుసగా అడ్డతీగల, రంపచోడవరం స్టేషన్లపైనా దాడులు సాగాయి.
చింతపల్లి దాడికి వందేళ్లు సమీపిస్తున్న సందర్భంగా తపాలా శాఖ స్మారక స్టాంపును ఆదివారం ఆవిష్కరించనుంది.
ఇదీ చదవండి:భరతమాత విముక్తికి ఆత్మార్పణ చేసిన వీరనారి అవంతిబాయి