SIBAL CONTROVERSY: సుప్రీంకోర్టు తీర్పులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌పై కోర్టు ధిక్కార చర్యలకు చేపట్టేందుకు ఇద్దరు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇందుకు అనుమతినివ్వాల్సిందిగా అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌కు విడివిడిగా లేఖలు రాశారు. నిబంధనల ప్రకారం సర్వోన్నత న్యాయస్థానంలో క్రిమినల్ ధిక్కార చర్యలను ప్రారంభించడానికి అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
సిబల్ తన వ్యాఖ్యల ద్వారా సుప్రీం కోర్టు స్వతంత్రతపై అనుమానాలు వ్యక్తంచేశారని న్యాయవాదులు వినీత్ జిందాల్, శశాంక్ శేఖర్ ఝాలు వేణుగోపాల్‌కు తెలిపారు. సర్వోన్నత న్యాయస్థాన ప్రతిష్ఠను మసకబార్చాలన్న దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మరోవైపు సిబల్ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ (ఏఐబీఏ) మండిపడింది. ఇది కోర్టు ధిక్కారమేనని పేర్కొంది.