అసోంలోని దరాంగ్ జిల్లా శిపాజ్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాల్‌పూర్ ప్రాంతంలో భూ అక్రమణల తొలగింపు ప్రక్రియ హింసాత్మకంగా మారింది. పోలీసు కాల్పుల్లో (assam police firing) ఇద్దరు మృతి చెందగా పది మంది పోలీసులు గాయపడ్డారు. తాజాగా ఈ ఘర్షణలకు (police firing in assam) సంబంధించి ఓ కెమెరామెన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరణించిన వ్యక్తిపై దాడికి పాల్పడటమే ఇందుకు కారణం. విజయ్ బనియా అనే ఈ ఫొటోగ్రాఫర్‌ను తొలగింపు ప్రక్రియలో భాగంగా పోలీసులు నియమించినట్లు తెలుస్తోంది. తూటాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తిపై విజయ్ దూకి.. అతని ఛాతిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరలైంది.
ధాల్పుర్లోని ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను (assam news) స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులు గ్రామస్థులకు ఇదివరకే నోటీసులు అందించినా.. స్థానికులు ఖాళీ చేయకపోవడం వల్ల పోలీసుల సాయంతో గ్రామస్థులను ఆ ప్రాంతం నుంచి తరలించసాగారు. జూన్‌లో ప్రారంభమైన ఈ ప్రక్రియ విడతల వారీగా సాగుతోంది. ఈ క్రమంలో గురువారం నాడు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకోగా గ్రామస్థులు నిరసనకు దిగారు. పదునైన ఆయుధాలు, రాళ్లతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
పరిస్థితిని సద్దుమణిగేందుకు పోలీసులు తొలుత బాష్పవాయువు (assam firing news) ప్రయోగించడం సహా గాల్లో కాల్పులు జరిపారు. అయినా అదుపులోకి రాకపోయేసరికి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు స్థానికులు తూటాలకు బలయ్యారు. గురువారం జరిపిన ఈ తొలగింపు ప్రక్రియ ద్వారా 500 కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించినట్లు అధికారులు వెల్లడించారు.
మండిపడ్డ రాహుల్..
కాల్పుల ఘటనపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అసోంలో ప్రభుత్వ ప్రాయోజిత కాల్పులు జరుగుతున్నాయి' అని విమర్శించారు. అందోళన చేస్తున్నవారికి సంఘీభావం ప్రకటించారు.
ఇదీ చూడండి : Census 2021 India: 'ఓబీసీ లెక్కల సేకరణ సాధ్యం కాదు'