పంజాబ్‌లోని లూథియానాలో మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు 2.17 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దు గ్రామమైన అట్టారి నుంచి ఈ హెరాయిన్ సరఫరా అయినట్లు గుర్తించారు.
సేలంత బ్రీ ప్రాంతానికి సమీపంలో ఓ ట్రక్కులో మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హెరాయిన్‌ను లూథియానా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పోలీసులు పట్టుకున్నారు.
ఈ సంఘటనలో నిందితులు కమల్‌జిత్ సింగ్ కమల్, భూపేంద్ర సింగ్‌లను అరెస్టు చేశారు. వీరిపై నార్కొటిక్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ సురేంద్ర కుమార్ వెల్లడించారు. ఇది అట్టారి సరిహద్దు నుంచి లూథియానాలోని పవన్ అనే వ్యక్తికి సరఫరా అయినట్లు గుర్తించారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మణిపుర్లో రూ.14 కోట్ల డ్రగ్స్ పట్టివేత