All India strike in march 2022: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె తలపెట్టినట్లు కేంద్ర కార్మిక సంఘాలు వెల్లడించాయి. కార్మిక, కర్షకులు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల జాయింట్ ఫోరం తెలిపింది.
" ఈ సమ్మెలో దాదాపు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొననున్నారు." అని ఆల్ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమర్జీత్ కౌర్ తెలిపారు. గ్రామీణప్రాంతాల్లోనూ సమ్మె నిర్వహిస్తామన్నారు. అయితే సమ్మె నేపథ్యంలో నిత్యావసర సేవలైన రవాణా, బ్యాంకింగ్, రైల్వే, విద్యుత్తు సేవలపై ప్రభావం పడనుంది.
వాళ్లు సైతం: ఎస్మా భయాలున్నా రోడ్ వేస్, ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని పేర్కొంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌కు చెందిన ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో భాగస్వాములు కానున్నారని తెలిపింది. కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్‌కమ్ ట్యాక్స్, కాపర్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ ఇలా ఆయా రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చాయని పేర్కొంది. రైల్వే, రక్షణ రంగ యూనియన్లు సైతం సమ్మెకు మద్దతుగా పెద్ద ఎత్తున జనసమీకరణ చేయనున్నాయని ఫోరం తెలిపింది.
సమ్మె ఇందుకే: ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం తర్వాత కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజలపై తన దాడులను మరింత ఉద్ధృతం చేసిందని సమావేశం అభిప్రాయపడింది. ఆ దాడిలో భాగంగానే ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1కి తగ్గించిందని పేర్కొంది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, సీఎన్‌జీ ధరలను అమాంతం పెంచేసిందని తప్పుబట్టింది. ప్రభుత్వ ఆస్తులను మానటైజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమావేశం ఖండించింది. రాష్ట్ర స్థాయిలోని వివిధ యూనియన్లు కూడా కలిసి రావాలని ఫోరం కోరింది. ఈ ఫోరంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ భాగస్వాములుగా ఉన్నాయి.
ఇదీ చూడండి: బిహార్ సీఎం నితీశ్‌పై దాడి.. నిందితుడు అరెస్ట్