కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు(three farm laws ) వ్యతిరేకంగా తొమ్మిది నెలలుగా కొనసాగిస్తున్న ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడంపై ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కేఎం) దృష్టి సారించింది. ఉద్యమం మొదలుపెట్టి(Farmers Protest) 9 నెలలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న రెండ్రోజుల 'అఖిల భారత రైతుల సదస్సు'ను భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయిత్(Rakesh Tikait) గురువారం ప్రారంభించారు. 'వ్యవసాయ చట్టాలపై మాతో చర్చించడానికి ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధంగా లేకపోవడం విచారకరం. అంతమాత్రాన మనం నీరుగారిపోవాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో ఇంతవరకు ఏం కోల్పోయాం, ఏం సాధించాం అనేది సమీక్షించుకుందాం' అని ఆయన చెప్పారు.
సెప్టెంబరు 25న భారత్ బంద్ పాటించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 22 రాష్ట్రాలకు చెందిన 300 రైతు సంఘాల ప్రతినిధులు, 18 అఖిల భారత కార్మిక సంఘాల నేతలు, 17 విద్యార్థి/ యువజన సంఘాలవారు దీనిలో పాల్గొన్నారని ఎస్‌కేఎం తెలిపింది. తొలిరోజు సదస్సులో వ్యవసాయ చట్టాలు సహా వివిధ అంశాలు చర్చించారని వెల్లడించింది. మూడు చట్టాలను నరేంద్రమోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా పోరాటాన్ని విస్తరించాలని ప్రజలకు పిలుపునిస్తూ ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: kabul airport blast: కాబుల్ ఆత్మాహుతి దాడులను ఖండించిన భారత్