నూతన ఐటీ నిబంధనలపై కేంద్రానికి ట్విట్టర్‌కు (Twitter) మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరయ్యారు. కొత్త నిబంధనలను ట్విట్టర్ ఇంకా పాటించకపోడాన్ని కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని స్థాయీ సంఘం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టినట్లు సమాచారం.
నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలని పార్లమెంటరీ ప్యానెల్ అడిగిన కఠిన ప్రశ్నలకు ట్విట్టర్ (Twitter) ప్రతినిధులు ఇచ్చిన సమాధానాలు అస్పష్టంగా, సందేహాస్పదంగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. సంస్థ విధానాల కంటే ప్రభుత్వ నిబంధనలే అత్యున్నతమని ప్యానెల్ సభ్యులు ట్విట్టర్ ప్రతినిధులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. 'కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తున్నందుకు మీకు జరిమానా ఎందుకు వేయొద్దో చెప్పాల'ని సభ్యులు ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది.
నూతన నిబంధనలు (New IT Rules) అమలు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని గతవారమే పార్లమెంటరీ స్థాయీ సంఘం ట్విట్టర్‌కు సమన్లు జారీ చేసింది.
పార్లమెంటరీ ప్యానెల్ ముందు ట్విట్టర్ తరఫున ఆ సంస్థ పబ్లిక్ పాలసీ మేనేజర్ శాగుఫ్తా కమ్రాన్, న్యాయవాది ఆయుషి కపూర్ హాజరయ్యారు.
కలిసి పనిచేసేందుకు సిద్ధం
ఆన్‌లైన్‌లో పౌరుల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఈ భేటీ అనంతరం ట్విట్టర్ అధికారిక ప్రకటనలో తెలిపింది.
" పార్లమెంటరీ ప్యానెల్ ముందు మా అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు అవకాశం దొరకడం అభినందనీయం. మా పారదర్శకత, భావ ప్రకటనా స్వేచ్ఛ, గోప్యత సూత్రాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో పౌరుల హక్కులను పరిరక్షించే ముఖ్యమైన పనిపై కమిటీతో కలిసి పనిచేయడానికి ట్విట్టర్ సిద్ధంగా ఉంది." అని సంస్థ అధికార ప్రతినిధ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సంభాషణ సేవ, రక్షణకు భాగస్వామ్య నిబద్ధతలో భాగంగా తమ సంస్థ భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కొనసాగుతుందని తెలిపారు.
ఇదీ చదవండి : దిగొచ్చిన ట్విట్టర్.. ఆ పోస్టుకు భారత అధికారి నియామకం