Alert For Tirumala Devotees Kapila Theertham Darshan Stopped by TTD: ఎన్నో ఆశలతో.. మరెన్నో కోరికలతో తిరుమల కొండపైకి ఎక్కేందుకు భక్తులు ప్రయాణం మొదలు పెడతారు. వ్యయప్రయాసలకోర్చి ఏడుకొండల వాడి సన్నిధికి చేరుకుంటారు. అయితే.. అప్పుడప్పుడూ అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటారు. దాంతో.. తిరుమల కొండపై అన్ని ప్రదేశాలనూ భక్తులు దర్శించుకోలేరు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో.. భక్తులకు నిరాశ తప్పట్లేదు.
తిరుమల కొండకు వెళ్లిన భక్తులు ముందుగా స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత.. ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తారు. అందులో.. ఆకాశ గంగ, శిలాతోరణం, కపిల తీర్థం.. వంటి పలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులో ప్రయాణించి.. ఆయా ప్రాంతాలను చుట్టి వస్తారు. అయితే.. ఇందులో కపిల తీర్థం సందర్శనను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపేసింది. దీనికి కారణం ఏమంటే.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలే!
అవును.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఆదివారం నాటికి తుపానుగా మారిన సంగతి తెలిసిందే. దీనికి "మిచౌంగ్"(Michaung Cyclone) తుపానుగా పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ తుపాను విజృంభిస్తోంది. దీని ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో సైతం.. గడిచిన రెండు రోజులుగా ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. కపిలతీర్థంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా.. భక్తులకు భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ప్రకటించింది. కపిలతీర్థంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. కాబట్టి.. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. సహకరించాలని కోరింది.
శ్రీవారి భక్తులకు శుభవార్త - ఫిబ్రవరి టికెట్ల బుకింగ్స్ - ఎప్పుడో తెలుసా?
కార్తికమాసం నేపథ్యంలో.. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగానే తరలి వస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. టీటీడీ నిర్వహిస్తున్న కార్తిక వనభోజనం కార్యక్రమానికి కూడా చిన్న అంతరాయం కలిగింది. సాధారణంగా ప్రతీఏటా కార్తీక మాసంలో.. పారువేట మండపంలో వనభోజన కార్యక్రమం నిర్వహిస్తుంది టీటీడీ. అయితే.. తుపాను నేపథ్యంలో వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న.. వైభవోత్సవ మండపానికి మార్చారు. స్నపనం తర్వాత.. భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
ఇదిలా ఉంటే.. పవిత్ర కార్తికమాసంలో నిర్వహించే.. కార్తిక వనభోజన ఉత్సవాల్లో భాగంగా.. ఆదివారం శ్రీదేవీభూదేవీ సమేత మలయప్ప స్వామికి వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా.. మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తరలివచ్చారు. అనంతరం స్వామివార్లకు పాలు, తేనె, పసుపు, పెరుగు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు కనులారా వీక్షించి సంతోషించారు.
తిరుమలలో డిసెంబర్ ఉత్సవాల లిస్టు ఇదే - ఆ 10 రోజులు దర్శనాలు రద్దు!