Governor Tamilisai Comments on CM KCR: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జీ-20 సమావేశాల్లో భాగంగా సీ-20 సమాజ్‌శాల కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. ఈ సమాజ్‌శాల కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మరోమారు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా రాష్ట్ర సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇంతకీ ఆమె ఏం వ్యాఖ్యలు చేశారంటే..?
'కొంత మంది మాట్లాడతారు కానీ పని చేయరు. నన్ను సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవలేదు. ప్రగతిభవన్.. రాజ్‌భవన్ దూరంగా ఉంటున్నాయి. అభివృద్ధి అంటే ఒకే కుటుంబం కోసం కాదు. ఒక్క కుటుంబమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలి. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను... రాజకీయాలు కోసం కాదు. కొవిడ్ సమయంలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందించాం. స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఇప్పుడు ప్రధాని మోదీ చేస్తున్నారు. సేవ చేయడం అనేది సంస్కృతిలోనూ, రక్తంలోనే ఉంది.' అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.
'మనం ఇతర దేశాల అధినేతలను కలవవచ్చు. కానీ ఈ రాష్ట్ర అధినేతను మాత్రం కలవలేం. ఇది చాలా దురదృష్టకరం. రాజకీయాలు మాట్లాడటం సరికాదు కానీ... దురదృష్టకరమేంటంటే దేశాలు సైతం కలుస్తున్నాయి కానీ.. రాజ్‌భవన్- ప్రగతిభవన్ మాత్రం కలవడం లేదు. అతిపెద్ద సచివాలయం ప్రారంభించినా... రాష్ట్ర ప్రథమ పౌరురాలికి ఆహ్వానం అందలేదు. ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా వ్యక్తిగతం కాదు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రివర్గ సభ్యులైనా... వారి వ్యక్తిగతమైన విషయం కాదు. రాష్ట్రం, దేశానికి చెందినవారు.'-తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
వివాదం ఎప్పటిది: గవర్నర్, ప్రభుత్వానికి మధ్య నడుస్తోన్న వివాదం ఇప్పటిది కాదు. గత రెండేళ్లుగా ప్రగతిభవన్, రాజభవన్ మధ్య దూరం పెరిగింది. ఇది కాస్త సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసైగా అనే విధంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ నుంచి అనుమతి రాలేదని ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. 10రోజులు ముందే ఆమెకు లేఖ పంపించామని అయినప్పటికి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. చివరికి ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమై బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం చేస్తున్నారు: ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమాలకు తనను దూరం చేస్తున్నారని అనేక సందర్భాల్లో తమిళిసై ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్‌లో అంబేడ్కర్ 125 విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనకు ఎలాంటి పిలుపు అందలేదని అన్నారు. ఆహ్వానం రానందున.. రాజ్ భవన్‌లోనే నివాళులు అర్పించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజకీయ నాయకురాలుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇవీ చదవండి: