ఓ భారీ ట్యాంకర్ లారీ టైరు పేలడం.. 9 మంది మృతికి కారణమైంది. రాజస్థాన్ జయ్‌పుర్ జిల్లా రామ్‌నగర్ సమీపంలో గురువారం జరిగిందీ ఘోర ప్రమాదం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
క్షణాల్లో పెను బీభత్సం..
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జైపుర్- అజ్మేర్ రహదారిపై రామ్‌నగర్ ప్రాంతంలో ఓ భారీ ట్యాంకర్‌తో కూడిన లారీ ప్రయాణిస్తోంది. గురువారం మధ్యాహ్నం 12.30 సమయంలో లారీ టైరు ఒక్కసారిగా పేలిపోయింది. ఫలితంగా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగంగా దూసుకెళ్లిన ట్యాంకర్.. ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా పడింది. ఏం జరిగిందో అని తెలుసుకునేలోపే కారు, బైక్‌పై ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్ కింద నలిగిపోయిన కారులో చిక్కుకుపోయిన మృదేహాలను చాలా సేపు శ్రమించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం పరీక్షల నిమిత్రం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అయిపోయాక మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. కారులోని వారంతా తీర్థయాత్ర కోసం ఫాగి నుంచి అజ్మేర్కు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఈ ప్రమాదం చాలా బాధాకరమని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్ ట్విట్ చేశారు. .
బస్సు కారు ఢీ.. నలుగురు మృతి..
రాంగ్ రూట్లో వచ్చిన ఓ ప్రైవేటు బస్సు.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. గురువారం మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఓ వ్యక్తి గాయపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విటా-నవేరి-మహబలేశ్వర్ రహదారిపై ఓ బస్సు.. విటా నుంచి నవేరి వెళ్తోంది. సాంగ్లీ జిల్లా కేంద్రానికి 60 కిలీమీటర్ల దూరంలో.. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న సదానంద్ కషీద్ గాయాలయ్యాయి. మృతులను ముంబయికు చెందిన యోగేశ్ కాదం(35), సునీతా సదానంద్ కషీద్ (61), అశోక్ సూర్యవంశీ (64)గా గుర్తించారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు మృతి..
తమిళనాడు ఈస్ట్ కోస్ట్ రహదారిపై పుదుచ్చేరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఓ ఆటోను ఢీకొట్టింది. కాంచీపురం జిల్లా మామల్లాపురం ప్రాంతంలోని మనమై గ్రామంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారని పోలీసులు తెలిపారు.