తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ జాతీయ కార్యదర్శి, బంగాల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై త్రిపుర రాజధాని అగర్తలలో సోమవారం దాడి జరిగింది. అయితే భాజపా కార్యకర్తలే తన వాహనంపై కర్రలతో దాడికి పాల్పడ్డారంటూ అభిషేక్ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎంపీ వాహనంపై.. భాజపా జెండాలు పట్టుకున్న కొందరు కర్రలతో దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
'భాజపా పాలనలో.. త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. రాష్ట్రాన్ని చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు' అంటూ సీఎం బిప్లబ్ దేవ్‌ను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. ఈ ఘటనపై టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పందించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని తెలిపారు.
త్రిపురలో టీఎంసీకి ఉన్న మద్దతుతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న వ్యూహంలో భాగంగా అక్కడ అభిషేక్ బెనర్జీ పర్యటిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ ప్యాక్ సభ్యులను అగర్తలలో ఇటీవల పోలీసులు నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు సహా కీలక నేతలు త్రిపురలో పర్యటించారు. వారిని నిర్బంధించడం చట్టవిరుద్ధమంటూ విమర్శించారు.
ఇవీ చదవండి: