ముక్కోణపు ప్రేమకథను(Triangle Love Story) విభిన్నంగా పరిష్కరించారు ఓ గ్రామస్థులు. లాటరీ(Bridegroom Lottery) ద్వారా ఇద్దరు యువతుల్లో ఒకరిని ఎంపిక చేసి, యువకుడితో వివాహం జరిపించారు. దాంతో.. కొన్ని నెలలుగా కొనసాగిన ఈ ప్రేమ కథ శుక్రవారం సుఖాంతమైంది. హాసన జిల్లా సకలేశపురం ప్రాంతంలోని ఓ కుగ్రామంలో జరిగిన సంఘటనను ఆ ఊరి ప్రజలు ఆదివారం బయటపెట్టారు.
అసలేం జరిగింది?
సకలేశపుర ప్రాంతానికి చెందిన యువకుడు అంతర్జాలం ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరిని ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. ఆ ఇద్దరు యువతులకూ అతడంటే చచ్చేంత ప్రేమ. అతడు లేకుండా బతకలేమన్నారు. అతడ్ని వివాహం చేసుకునేందుకు ఇద్దరూ సమ్మతించారు. అయితే ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో ఆ యువకుడికి అర్థం కాలేదు. గ్రామస్థులు 'పంచాయితీ' చేసినా ఫలితం లేకపోయింది. ఆ పరిస్థితుల్లో ఓ యువతి ముందుకొచ్చి ఆ యువకుడు లేని జీవితం తనకు వ్యర్థమని చెప్పి విషం తాగింది.
ఆ షరతుతో...
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ఆమె కోలుకుని గ్రామానికి తిరిగి వచ్చింది. శుక్రవారం మరోసారి ముక్కోణపు ప్రేమ వ్యవహారం తెరమీదకు వచ్చింది. గ్రామస్థులు చివరికి ఓ మార్గాన్ని కనిపెట్టారు. లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని, ఇందులో విఫలమైన యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మౌనంగా వెనుదిరగాలని షరతు విధించారు. లాటరీ తీయగా అందులో విషం తాగిన యువతి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ యువకుడితో ఆమె వివాహం జరిపించారు. ప్రేమపురాణంలో విఫలమైన యువతి తన పోటీదారుతో మాట్లాడుతూ 'మీ వివాహ జీవితం సంతోషంగా కొనసాగాల'ని ఆకాంక్షించింది. అయితే తనను మోసగించిన యువకుడిని సులువుగా వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించడం గమనార్హం.
ఇదీ చూడండి: 'అమెరికా అమ్మాయి' విశాఖ కోడలైతే.. ఆవకాయ జున్నులా...
ఇదీ చూడండి: వాతావరణ మార్పులపై పుస్తకం.. 10 ఏళ్ల బాలుడి ఘనత