train derailment in maharastra: లోకమాన్య తిలక్ టెర్మినస్-జయనగర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని 10 కోచ్‌లు ఆదివారం మధ్యాహ్నం పట్టాలు తప్పాయి. మహారాష్ట్ర నాసిక్ సమీపంలోని లహవిత్,దేవ్‌లాలి స్టేషన్‌ల మధ్య పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. వైద్య, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని సెంట్రల్ రైల్వే అధికారి తెలిపారు. మధ్యాహ్నం 3.10 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు.
ఘటనా స్థలానికి అత్యవసర సహాయక వాహనాన్ని అధికారులు పంపించారు. రైల్వే పోలీస్ ఫోర్స్ స్క్వాడ్, బ్రేక్‌డౌన్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటన కారణంగా ఇప్పటి వరకు ఏడు రైళ్లను రద్దు చేయగా.. మరో మూడు రైళ్లను దారి మళ్లించినట్లు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇంకొక రెండు రైళ్ల ప్రయాణ దూరాన్ని తగ్గించారు. కోచ్‌లను ప్రయాణికులతో నాసిక్ వైపు తరలిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులనూ ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'యోగీ జీ.. 'బుల్డోజర్'తో మా ఇల్లు కూల్చేయండి ప్లీజ్!'