Train Accident: బంగాల్లో గురువారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. 45 మందికి పైగా గాయపడ్డారు. బికనేర్ నుంచి గువాహటికు ప్రయాణిస్తున్న రైలు.. దొమోహనీ వద్ద గురువారం సాయంత్రం 5 గంటలకు పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పగా, వీటిలో ఏడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు.
గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై.. దర్యాప్తు జరపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో.. రైళ్లో మొత్తం 1053 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తైందని అధికారులు ప్రకటించారు. దెబ్బతిన్న కంపార్ట్మెంట్లను తొలగించేందుకు చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
మోదీ సంతాపం
బంగాల్లోని దొమోహనీ రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. అలాగే.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి.. పరిస్థితిని తెలుసుకున్నట్లు చెప్పారు.
పరిహారం ప్రకటన..
రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1లక్ష, చిన్న చిన్న గాయాలైన వారికి రూ.25వేల చొప్పున పరిహారం ప్రకటించారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్లు ట్వీట్ చేశారు మంత్రి.
ఇదీ చూడండి: రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ- అన్నదమ్ములు దుర్మరణం