Bihar lovers suicide story: ఓ చిన్న విషయంపై గొడవ కారణంగా ఇద్దరు యువతీయువకులు ఆత్మహత్య చేసుకున్నారు. 23 ఏళ్ల అమ్మాయి బిహార్ ముజఫర్‌పుర్‌లో ఉరేసుకుని చనిపోయింది. ఈ కేసులో ఏం జరుగుతుందోననే భయంతో అబ్బాయి రాజస్థాన్ జైపుర్‌లో భవనం 8వ అంతస్తు నుంచి దూకాడు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
పాఠశాల నుంచే పరిచయం: అంజలి, వివేక్.. బిహార్ ముజఫర్‌పుర్ వాసులు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వారి స్నేహం.. క్రమంగా ప్రేమగా మారింది. వీరి బంధం గురించి ఇద్దరి కుటుంబ సభ్యులకూ తెలుసు. చార్టెర్డ్ అకౌంటెంట్ కావాలన్న లక్ష్యంతో అంజలి ముజఫర్‌పుర్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఇంజినీరింగ్ విద్య కోసం కొన్నేళ్ల క్రితమే వివేక్ రాజస్థాన్ జైపుర్ వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు.
అంజలి, వివేక్ మధ్య ఇటీవల ఏదో విషయంలో చిన్న గొడవైంది. బుధవారం రాత్రి ఇద్దరికీ ఫోన్లో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరి స్నేహితురాలు ఒకరు కాన్ఫరెన్స్ కాల్‌లోనే ఉంది. చాలాసేపటి తర్వాత గొడవ సద్దుమణిగినట్టే అనిపించింది. అంతా బాగుందనుకునే సరికి వివేక్ అర్ధంతరంగా కాల్ కట్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. గురువారం తన గదిలో అంజలి బయటకు రాలేదు. ఇంట్లోవాళ్లు ఎంత పిలిచినా పలకలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. వారు ఖాజీ మహ్మద్‌పుర్ ఠాణాకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించింది అంజలి. ఆ గదిలో సూసైడ్ నోట్ ఏమీ దొరకలేదు. పోలీసులు ఆరా తీయగా.. బుధవారం రాత్రి వివేక్‌తో ఫోన్లో జరిగిన గొడవ గురించి తెలిసింది.
భయంతో వివేక్: అంజలి ఆత్మహత్య తర్వాత ఆమె సోదరుడు వివేక్‌కు ఫోన్ చేశాడు. 'నా సోదరి చావుకు నువ్వే కారణం. నీ సంగతి చూస్తాం' అన్నాడు. ఈ మాటలతో వివేక్ వణికిపోయాడు. జైపుర్‌లో తాను ఉంటున్న భవనం 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంజలి కుటుంబసభ్యులే వేధించారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని వివేక్ బంధువులు ఆరోపించారు. అంజలి సోదరుడి బెదిరింపులే వివేక్ బలవన్మరణానికి కారణమని ఫిర్యాదు చేశారు.