నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. బడ్జెట్‌లో పేర్కొన్న ప్రైవేటీకరణ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిరసనలు చేయనున్నట్లు స్పష్టం చేశాయి. కార్మిక స్మృతులను ఉపసంహరించుకునేలా, పేద కార్మికులకు ఆదాయ, ఆహార మద్దతును అందించేలా కేంద్రం ఒత్తిడి తేవాలని సూచించింది కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక.
ఈ మేరకు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ), హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (ఏఐయూటీయూసీ), ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ), సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (ఎస్‌ఈడబ్ల్యూఏ), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఏఐసీసీటీయూ), లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్‌పీఎఫ్), యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యూటీయూసీ)లు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
'ఆ బిల్లులు రద్దు చేయాలి'
''కార్మిక స్మృతులు, విద్యుత్తు బిల్లు-2020 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు, శ్రమ జీవులు ఈ నెల మూడో దేశవ్యాప్త నిరసన చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపునిస్తోంది. ప్రైవేటీకరణ విధానాలకు చరమగీతం పాడాలి. పేద కార్మికులకు, పేదలకు ఆదాయ, ఆహార మద్దతు ఇవ్వాలి. ఈ నెల ఒకటో తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కనిపించిన ప్రజావ్యతిరేక నిర్ణయాలపై నిరసన తెలపాలి.'' అని కోరుతూ మంగళవారం.. ఉమ్మడి వేదిక తరఫున ఓ ప్రకటన విడుదలైంది.
ఇదీ చూడండి: 'ఈ శతాబ్ధపు అతి ముఖ్యమైన అంశాల్లో డేటా ప్రైవసీ ఒకటి'