పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణికి ఆపరేషన్ చేశాడో వైద్యుడు. బిడ్డను బయటకు తీసి కడుపులో టవల్ వదిలేశాడు. విషయం తెలియని ఆ మహిళ కడుపునొప్పితో బాధపడింది. భరించలేక మరో ఆసుపత్రికెళితే అక్కడ ఈ వైద్యుడి నిర్వాకం బయటపడింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది
అమ్రోహా ప్రాంతానికి చెందిన నజ్రానా అనే మహిళ కొద్ది రోజుల క్రితం ప్రసవ వేదనతో స్థానిక సైఫీ నర్సింగ్ హోంలో చేరింది. అక్కడ వైద్యుడు మత్లూబ్, ఆయన సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా టవల్‌ను ఆమె పొట్టలోనే ఉంచి కుట్లేశారు. ఆపరేషన్ తర్వాత నజ్రానా కడుపునొప్పి ఎక్కువగా ఉందని చెప్పింది. కానీ, ఆ డాక్టర్.. బయట చలి ఎక్కువగా ఉండటం వల్ల అలా జరిగిందని చెప్పి మరో ఐదు రోజులు ఆసుపత్రిలోనే పరిశీలనలో ఉంచాడు.
ఇంటికి వచ్చాక కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో ఆమె భర్త మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత వైద్యులు ఆమెకు మరో ఆపరేషన్ చేసి టవల్‌ను బయటకు తీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ సింఘాల్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. మత్లూబ్ నిర్వహిస్తున్న ఆ ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేవని సమాచారం.
ఇవీ చదవండి: ఆ నమూనాలు శ్రద్ధావే.. డీఎన్ఏ నివేదికలో వెల్లడి
సైకిల్‌ను ఢీకొట్టి.. అమ్మాయిని ఈడ్చుకెళ్లిన కారు.. అచ్చం దిల్లీ కేసులానే!