సాగు చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్న రైతుల్లో కొందరు ఎర్రకోటలోకి ప్రవేశించడాన్ని ఖండించారు కేంద్ర పర్యటక మంత్రి ప్రహ్లాద్ పటేల్. ఈ చర్యతో రైతులు భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన ఎర్రకోటను అగౌర పరిచారన్నారు.
"ఎర్రకోట మన ప్రజాస్వామ్యానికి ప్రతీక. రైతులు దానికి దూరంగా ఉండాల్సింది. ఈ తీవ్ర చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం"
- కేంద్ర పర్యటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ ట్వీట్
'హింస సమస్యకు పరిష్కారం కాదు'
రైతులు ఎర్రకోటలోకి ప్రవేశించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందించారు. హింస.. సమస్యకు పరిష్కారం కాదన్నారు. నిరసనల్లో ఎవరు బాధపడినా.. అది దేశంపై ప్రభావం చూపుతుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
"హింస.. సమస్యకు పరిష్కారం కాదు. దీని వల్ల ఎవరూ బాధపడినా.. దేశానికే నష్టం జరుగుతుంది. జాతీయ ప్రయోజనాల కోసం మూడు సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
'రైతులపై లాఠీఛార్జి అమానుషం'
ట్రాక్టర్ పరేడ్‌లో రైతులపై బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీఛార్జి చేయడం విరుద్ధమైన చర్య అని కేంద్రంపై నిప్పులు చెరిగింది సీపీఎం.
"కర్షకులపై బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీఛార్జి చేయడం విరుద్ధమైన చర్య. ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు ఎందుకిలా వ్యవహరించారు? ప్రభుత్వం ఎందుకు ఘర్షణ రేకెత్తిస్తుంది? శాంతియుతమైన ట్రాక్టర్ ర్యాలీని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలి."
- సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి
దిల్లీలో రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ట్రాక్టర్ పరేడ్‌కు పోలీసులు అనుమతించిన దారుల్లో కాకుండా ఇతర మార్గాల ద్వారా ఎర్రకోటలోకి ప్రవేశించారు కొందరు రైతులు. అక్కడ జాతీయ జెండాను ఎగరవేసిన స్తంభానికి వివిధ రైతు సంఘాల జెండాలను ఎగరవేశారు.
ఇదీ చూడండి: 'దిల్లీలో ఘర్షణలకు వారే కారణం'