Tomato Theft Karnataka : 11వేల క్వింటాళ్ల టమాటాలను మాయం చేశాడు ఓ లారీ డ్రైవర్. వీటి ధర దాదాపు రూ. 21 లక్షల ఉంటుందని అంచనా వేశారు. రాజస్థాన్ జైపుర్‌లోని మార్కెట్లో టమాటాలను అన్లోడ్ చేయమని పంపిస్తే.. వాటిని గుజరాత్లో బేరం పెట్టాడు ఓ డ్రైవర్. అనంతరం పరారై.. కర్ణాటకకు చెందిన ట్రైడర్లను నిలువునా ముంచాడు. ఖాళీ లారీని మాత్రం ఓ పెట్రోల్ బంక్ పక్కన నిలిపి వెళ్లాడు డ్రైవర్. ఘటనపై పోలీసులను ఆశ్రయించారు బాధిత వ్యాపారస్థులు.
కర్ణాటకలోని కొలార్ ఏపీఎమ్‌సీ మార్కెట్‌కు చెందిన వ్యాపారస్థులు.. దాదాపు 750 బాక్స్‌ల టమాటాలను లారీ ద్వారా రాజస్థాన్‌లోని జైపుర్ మార్కెట్‌కు పంపించారు. జూలై 27న వీటిని తరలించగా.. ఆదివారం రాత్రికి జైపుర్ మార్కెట్‌కు చేరాల్సి ఉంది. కానీ ఆదివారం సాయంత్రం నుంచే లారీ డ్రైవర్ అన్వర్ అందుబాటులో లేకుండా పోయాడు. ఎంత ప్రయత్నించినా వ్యాపారస్థులకు అతడి ఆచూకీ లభించలేదు. దీంతో కంగారు పడ్డ ట్రేడర్లు నేరుగా పోలీసులను ఆశ్రయించారు.
అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. లారీ ఆచూకీ కనుక్కునే పనిలో పడ్డారు. రాజస్థాన్‌లోని జాలోర్ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ లారీని గుర్తించారు. డ్రైవర్ అన్వర్ మొత్తం టమాటాలను వేరే వ్యక్తిని అమ్మినట్లు పోలీసులు తేల్చారు. కొన్న వ్యక్తిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాష్‌గా నిర్ధరించారు. అనంతరం డ్రైవర్ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
"డ్రైవర్ చివరగా శనివారం రాత్రి 9 గంటలకు మాతో మాట్లాడాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. దీంతో కొలార్ పోలీసులను సంప్రదించాం. ఆ తర్వాత టమాటాలను గుజరాత్‌కు చెందిన వ్యక్తికి.. డ్రైవర్ అమ్మినట్లు తెలిసింది. కిలో రూ.160 చొప్పున మాట్లాడుకుని.. రాజస్థాన్‌కు పంపించాం." అని బాధిత వ్యాపారస్థుడు తెలిపాడు. గుజరాత్‌కు కూడా వెళ్లి అక్కడి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని అతడు పేర్కొన్నాడు.
కొలార్ ఏపీఎమ్ఎస్ (అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ) ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్. ఇక్కడి నుంచి చాలా దేశాలకు టమాటాలు ఎగుమతి అవుతాయి. ఈ మధ్య టమాటాల ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా.. ఈ మార్కెట్ చుట్టు భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.
టమాటాల వ్యాన్ హైజాక్.. 2500 కిలోల సరకుతో పరార్..
Tomato Vehicle Robbery : టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఈ తరహా దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఇరవై రోజుల క్రితం కూడా 2.5 టన్నుల టమాటాల వాహనాన్ని హైజాక్ చేశారు ముగ్గురు దుండగులు. టమాటాలను మార్కెట్‌కు తరలిస్తుండగా.. మధ్యలో వాహనాన్ని లాక్కుని తీసుకెళ్లారు. ఈ ఘటన సైతం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.