రైతు సంఘాల నేతలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తీవ్రస్థాయిలో మండిపడినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరిస్తూ రైతులు పత్రికా ప్రకటన విడుదల చేయడంపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
దిల్లీ విజ్ఞాన్ భవన్ వేదికగా రైతులు, కేంద్ర మంత్రులు 11వసారి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో.. తమ ప్రతిపాదనను తిరస్కరిస్తే.. ఆ విషయం సమావేశానికి వచ్చి చెప్పాలి కానీ ముందుగా మీడియాకు చెప్పడమేంటని తోమర్ రైతులను ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమేనని తోమర్ మండిపడినట్టు పేర్కొన్నాయి.
దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు కారణమైన వివాదాస్పద సాగు చట్టాలను 1.5ఏళ్లు పాటు నిలిపివేస్తామని.. 10వ దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై ఆలోచించి చెబుతామని చెప్పి రైతులు భేటీని ముగించారు. అయితే ఈ ప్రదిపాదనను రైతులు తిరస్కరించారంటూ గురువారం మీడియాలో వార్తలొచ్చాయి.
మరో వైపు.. ప్రభుత్వం, రైతుల మధ్య జరుగుతున్న చర్చల సంభాషణలు బయటకు ఎలా వెళుతున్నాయని తోమర్ ప్రశ్నించారు. దీని వెనకున్న ఆంతర్యం ఏంటని అడిగినట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:- 'రైతుల పట్ల కేంద్రానికి ఇంత అహంకారమా?'