Tollywood Drugs Case Update : తెలుగు చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె.వెంకటరత్నారెడ్డి, మరో నిందితుడు బాలాజీని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు(Anti Narcotics Bureau Police) కస్టడీకి తీసుకుని విచారించగా.. సినీ పరిశ్రమకు చెందిన పలువురికి నైజీరియన్లతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.
Hero Navadeep Drug Case : వెంకటరత్నారెడ్డి, బాలాజీలు ఇచ్చిన సమాచారంతో ముగ్గురు నైజీరియన్లు, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ విఠల్‌రావు కుమారుడు దేవరకొండ సురేశ్‌రావు, సినీ దర్శకుడు అనుగు సుశాంత్‌రెడ్డి, చిత్ర పరిశ్రమతో సంబంధాలున్న రాంచంద్, మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి కోటి విలువైన 8 గ్రాముల కొకైన్, 50 గ్రాముల MDMA, కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరత్నారెడ్డి బ్యాంకు ఖాతాలోని ఐదున్నర కోట్లు స్తంభింపజేశారు. సినీ నటుడు నవదీప్(Navadeep Drugs Case), షాడో చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి, స్నార్ట్ పబ్ యజమాని సూర్య, ముగ్గురు నైజీరియన్లు పరారీలో ఉన్నారని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Madhapur Drugs Case : నైజీరియాకు చెందిన అమోబీ చుక్వుడి బెంగళూరులోని యెలహంక ఫుట్‌బాల్ క్లబ్‌లో సభ్యుడు. అఖిల భారత నైజీరియా విద్యార్థి, కమ్యూనిటీ సంఘం సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఇతడు.. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే తమ దేశస్థులకు బెయిల్ ఇప్పించేందుకు, స్వదేశానికి పంపేందుకు నిధులు సమీకరిస్తాడు. నైజీరియాకే చెందిన ఇగ్బావ్రే మైఖేల్, థామస్ అనఘా కలూలు.. అమోబీతో కలిసి బెంగళూరు, హైదరాబాద్‌లలోని పరిచయస్థులకు డ్రగ్స్ అమ్ముతుంటారు. వీరితో విశాఖపట్నం వాసి, వరంగల్‌లో నివాసముండే డ్రగ్స్ స్మగ్లర్ రామ్‌కిశోర్‌కు పరిచయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన కాప భాస్కర్ బాలాజీకి నైజీరియన్లను రామ్‌కిశోర్ పరిచేయం చేశాడు. ఫైనాన్షియర్ కె.వెంకటరత్నారెడ్డి తాను నిర్వహించే పార్టీల కోసం బాలాజీ ద్వారా డ్రగ్స్ తెప్పించేవాడు. డ్రగ్స్(Hyderabad Drugs Case) విక్రయాలకు బాలాజీ స్నాప్‌చాట్ ద్వారా గాడ్స్‌హెడ్ పేరుతో ఖాతా తెరిచి సంప్రదింపులు జరిపేవాడు.
Tollywood Director in Hyderabad Drugs Case : వెంకటరత్నారెడ్డి, బాలాజీ ఫోన్లలోని డేటా, ఇతర సమాచారం ఆధారంగా అమోబీ, మైఖేల్, థామస్‌లతోపాటు దేవరకొండ సురేశ్‌రావు, విశాఖపట్నం వాసి కొల్లి రాంచంద్, ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూరపాటి సందీప్, అనుగు సుశాంత్‌రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన పోకర్ నిర్వాహకుడు పగళ్ల శ్రీకర్ కృష్ణప్రణీత్‌లను అదుపులోకి తీసుకున్నారు. 13 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటరత్నారెడ్డి, కూరపాటి సందీప్, సూర్య, కలహర్‌రెడ్డి, కృష్ణప్రణీత్ తదితరులు బాలాజీ నుంచి డ్రగ్స్ తీసుకుని.. పార్టీలు నిర్వహించేవారని పోలీసులు తెలిపారు.