కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను (Farm laws 2020) రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని (Farm laws repeal) పేర్కొన్నారు మోదీ. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు. గురునానక్ జయంతి (Guru nanak jayanti) సందర్భంగా జాతిని ఉద్దేశించి (PM Narendra Modi addresses the nation) ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ కీలక ప్రకటన చేశారు.
మంచివే కానీ..
తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు(Farm laws 2020) రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు తెలిపారు మోదీ. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని అన్నారు.
''3 వ్యవసాయ చట్టాల లక్ష్యం.. సన్నకారు రైతుల్లో సాధికారత తీసుకురావడం. ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చేవే. కానీ.. ఒక వర్గం రైతులను మేం ఒప్పించలేకపోయాం. ఐదు దశాబ్దాల నా ప్రజా జీవితంలో రైతుల కష్టాలను, సవాళ్లను తెలుసుకున్నా.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించిన ప్రధాని.. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదింతలు పెంచినట్లు తెలిపారు.
రైతుల విజయం..
సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాది నుంచి దిల్లీ సరిహద్దుల్లో(Farmers protest) నిరసనలు చేస్తున్నారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా.. ఫలించలేదు. అయితే.. ఇన్ని రోజుల తర్వాత నేడు వ్యవసాయ చట్టాలపై (Modi addresses the nation) వెనక్కి తగ్గింది కేంద్రం.
వ్యవసాయ చట్టాల్లో ఏముందంటే..
కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రంగానికి(Farm laws repeal) సంబంధించి గతేడాది తొలుత మూడు ఆర్డినెన్సులను, తర్వాత వాటి స్థానంలో బిల్లులను తెచ్చింది. అవి పార్లమెంటు ఆమోదం పొంది చట్టాలయ్యాయి. అవేంటంటే..
- రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
- రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
- అత్యవసర వస్తువుల సవరణ బిల్లు-2020
1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత ఏపీఎంసీ మార్కెట్ వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రైతులకు సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ మార్గాలను కల్పించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్‌ను గానీ పన్నులనూ వసూలు చేయరు.
2.రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
రైతులు నేరుగా అగ్రికల్చర్ బిజినెస్ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
3. నిత్యవసర వస్తువుల సవరణ బిల్లు-2020
తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిపాయ, బంగాళాదుంపలు వంటి ఉత్పత్తులను నిత్యవసర వస్తువుల జాబితా నుంచి తొలగించాలని ఈ సవరించిన ఈ చట్టం చెబుతుంది. యుద్ధం, కరువు లాంటి పరిస్థితుల్లో ఈ వస్తువులపై పరిమితులు ఎత్తివేయాలని నిర్దేశిస్తుంది.