కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ పదవీ కాలం ముగిసే వరకు దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని రైతు నాయకుడు నరేంద్ర తికాయిత్ తెలిపారు. రైతుల ఆందోళనల గురించి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇతర ఆందోళనలను అణచివేసిన తరహాలో రైతుల ఉద్యమాన్ని అరికట్టాలనుకునే అపోహ నుంచి ప్రభుత్వం తేరుకోవాలని హితవు పలికారు. ఈ ఆందోళనలతో టికాయిత్ కుటుంబం ఆస్తులు పెంచుకొని లబ్ధి పొందుతోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తమపై వచ్చిన విమర్శల్లో ఒక్కటి రుజువైనా ఈ పోరాటం నుంచి తప్పుకుంటామని ప్రకటించారు.
"ప్రభుత్వం వివిధ వ్యూహాలను అనుసరించి గతంలో ఇతర ఆందోళనలను అణచివేసింది. ఇప్పడు రైతుల ఉద్యమాన్ని కూడా అలాగే చేయాలనే అపోహలో ఉంది. నేను ముజఫర్‌నగర్‌లో ఉన్నప్పటికీ.. నా కళ్లు దిల్లీ సరిహద్దుల్లోనే ఉన్నాయి. తరచూ వెళ్లి బీకేయూ మద్దతుదారుల్ని కలిసి వస్తున్నాను. ఈ నిరసనల్ని ప్రభుత్వం అణచివేయలేదు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయి. మోదీ ప్రభుత్వానికి ఇంకా మూడున్నర సంవత్సరాల గడువు ఉంది. ఆ గడువు ముగిసే వరకు మేం పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రం పంటలకు మద్దతు ధర ఉంటుందని చెబుతోంది. కానీ మరి ఆ విషయంలో రాత పూర్వక హామీ ఎందుకు ఇవ్వలేకపోతోంది?"
-నరేంద్ర టికాయిత్, రైతు నాయకుడు
టికాయిత్ కుటుంబంలో అగ్రజుడైన నరేష్ టికాయిత్ బీకేయూ అధ్యక్షుడిగా, మరో సోదరుడు రాకేశ్ టికాయిత్ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
'భాజపాను ఓడించాలని కోరతాం'
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయొద్దనే పిలుపుతో తమ ప్రచారం కొనసాగిస్తామని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నాయకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా త్వరలోనే బంగాల్‌లో పర్యటిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించాలని మాత్రమే తాము ప్రచారం చేస్తామని, మిగతా ఏ రాజకీయ పార్టీకీ మద్దతు తెలపబోమని స్పష్టంచేశారు.
"మార్చి 13న.. బంగాల్‌లో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసే కిసాన్ మహా పంచాయత్‌లో రైతులతో మాట్లాడతాను. అక్కడ జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించాలని వారిని విజ్ఞప్తి చేస్తాను." అని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ పేర్నొన్నారు.
ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తారా అన్న ప్రశ్నకు అలాంటి కార్యాచరణ ఏదీ లేదని టికాయత్ సమాధానమిచ్చారు. రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపితే తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం మాత్రం ఆయనకు లేదన్నారు.
ఇదీ చదవండి: మహాకూటమి నందిగ్రామ్ అభ్యర్థిగా మీనాక్షీ ముఖర్జీ